
ఖమ్మం: దమ్మపేట మండలంలో కిరాయి హంతకుల కుట్రను భగ్నం చేశారు పోలీసులు. అశ్వారావు పేట నియోజక వర్గంలో గిరిజన సమస్యల పోరాటం చేస్తున్న సోడేం వెంకట్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని హత్య చేస్తే రూ. 30 లక్షలు ఇచ్చేందుకు బాబా ఖాన్ అనే మాజీ నక్సలైట్ ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు హంతకులు. వీరి కుట్రను తెలుసుకున్న పోలీసులు ఈ రోజు తెల్లవారు జామున వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై సోడేం వెంకట్ మాట్లాడుతూ.. 2018 అక్టోబర్ 6 న కూడా తనపై హత్యా ప్రయత్నం చేశారని, ఇప్పుడు కూడా వారే ఈ కుట్ర పన్నారని మీడియాతో అన్నాడు. మహబూబా బాద్ జిల్లా కేసముద్రం కు చెందిన గోకవరపు శేషగిరి రావు, దారా యుగంధర్, గాదెంశెట్టి వెంకట సత్యనారాయణ రాజు, పోతినేని శ్రీరాం వెంకట్ రావు, పసుమర్తి ముక్తేశ్వర్ రావు లు కలసి తనతో పాటు తన సోదరులైనటువంటి మరో ఇద్దరినీ కూడా చంపేందుకు పథకం రచించారని తెలిపాడు. మహబూబా బాద్ జిల్లా ఎస్పి నిబద్ధతతో తన ప్రాణాలు నిలిచాయన్నాడు.