రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

TPCC అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇంటి వద్ద భారీ సంఖ్యలో స్పెషల్ టాస్క్ ఫోర్స్, పోలీసులు మోహరించారు. కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్‌’ ర్యాలీకి ఆయన వెళ్లకుండా అడ్డుకొనేందుకు జూబ్లీహిల్స్ లోని రేవంత్‌ ఇంటి దగ్గర పోలీస్‌ బలగాలు మోహరించాయి. దిల్‌సుఖ్‌నగర్‌-ఎల్బీనగర్‌ రూట్‌లో ఈ ర్యాలీకి అనుమతి లేదని, ట్రాఫిక్‌ జాం అవుతుందని పోలీసులు తెలిపారు. ర్యాలీ నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అయితే, ఈ ర్యాలీ ఎలాగైనా చేపట్టితీరుమతాని రేవంత్‌ ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు జంగ్  సైరన్ ప్రారంభమవుతుందని.. అందరూ దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకోవాలని, లాఠీఛార్జికి భయపడాల్సిన అవసరం లేదని రేవంత్‌ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ శ్రేణులు దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకొనేందుకు రెడీ అవుతుండగా రేవంత్‌ అక్కడికి వెళ్లకుండా అడ్డుకొనేందుకు దాదాపు 100 మందికి పైగా పోలీసులు ఆయన నివాసం దగ్గర మోహరించారు. అయితే.. 4గంటలకు అంతా ఒకేసారి రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండటంతో దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు పోలీసులు మోహరించారు. కాంగ్రెస్‌ శ్రేణులు ప్రగతిభవన్‌ వైపు వెళ్లే అవకాశం కూడా ఉండటంతో ఆ పరిసరాల్లోనూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినట్టు సమాచారం. రేవంత్ హౌజ్ అరెస్టుతో కావడంతో సోషల్ మీడియా ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయకుండా ఆయన యూట్యూబ్ చానల్ ను కూడా బ్లాక్ చేశారు.

మరోవైపు.. దిల్‌సుఖ్‌నగర్‌ దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు ర్యాలీ చేపడతానని రేవంత్‌ ప్రకటించడంతో అలర్టైన అధికారులు.. దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు.