
- ఇప్పటికే మల్లోజుల, ఆశన్న లాంటి పెద్ద లీడర్ల లొంగుబాటు
- రెండు రోజుల్లోనే 300 మందికిపైగా మావోయిస్టులు సరెండర్
- దండకారణ్యంలో నిలిచిన జనతన సర్కార్ కార్యకలాపాలు
- క్యాడర్ లేకపోవడంతో బలహీనపడుతున్న లీడర్లు
హైదరాబాద్, వెలుగు: మావోయిస్టు ఉద్యమం తుది అంకానికి చేరినట్లు పోలీసులు భావిస్తున్నారు. పీఎల్జీఏ కమాండర్ మడవి హిడ్మా.. సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ బయటికి వస్తే పార్టీ దాదాపు ఖాళీ అయినట్లేనని చెబుతున్నారు. ఈక్రమంలో వీరిద్దరిపైనే నాలుగు రాష్ట్రాల పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోగా, మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వంటి సీనియర్ లీడర్లు పోలీసులకు లొంగిపోయారు. గడిచిన మూడు రోజుల్లో 300 మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు సరెండర్ అయ్యారు. దీంతో మొన్నటిదాకా దండకారణ్యంలో ఉనికిలో ఉన్న జనతన సర్కార్ నిర్వీర్యమైంది. క్యాడర్ లేకపోవడంతో లీడర్లు బలహీన పడుతున్నారనే వార్తలు వస్తున్నాయి.
దండకారణ్యంలో నిలిచిన జనతన సర్కార్ కార్యక్రమాలు
నాలుగు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన దండకారణ్యంలో మొన్నటిదాకా మావోయిస్టులు జనతన సర్కార్ నడిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, పూర్తిగా మావోయిస్టుల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాంతరంగా ఈ ప్రభుత్వం చాలాకాలం మనుగడలో ఉంది. జనతన సర్కార్లో భాగంగా ప్రతి గ్రామం, సమూహాల్లో రివల్యూషనరీ పీపుల్స్ కమిటీలు (ఆర్పీసీలు) ఏర్పాటు చేశారు. వీటిలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, రేషన్ పంపిణీ, సురక్ష దళాలపై పర్యవేక్షణ లాంటి విభాగాలు ఉండేవి. భూవివాదాలు, కుటుంబ తగాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా ‘ప్రజా న్యాయస్థానాలు' అందుబాటులోకి తెచ్చారు. మావోయిస్టు అగ్రనేతలు ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాల్ రావు (అభయ్), తక్కళ్లపల్లి వాసుదేవరావు (ఆశన్న), రణిత లాంటి లీడర్లు ఈ జనతన సర్కారుకు మార్గదర్శకత్వం వహించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరంతా ఆయుధాలు వీడి పోలీసులకు లొంగిపోయారు. వీరితో పాటు గడిచిన నాలుగు రోజుల్లో దండకారణ్యం నుంచి 300 మందికి పైగా మావోయిస్టులు తుపాకులతో వచ్చి పోలీసులకు సరెండర్ అయ్యారు. దీంతో దండకారణ్యంలో జనతా సర్కార్ కార్యకలాపాలు పూర్తిగా కనుమరుగైనట్లేనని పోలీసులు ప్రకటించారు.
హిడ్మా.. దేవ్ జీ కోసం గాలింపు..
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) 1వ బెటాలియన్ కమాండర్, సెంట్రల్ కమిటీ మెంబర్ మడవి హిడ్మా, సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ దండకారణ్యం నుంచి బయటికి వస్తే మావోయిస్ట్ ఉద్యమం ఖాళీ అయినట్లేనని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఈ ఏడాది మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, గణేష్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి వంటి నాయకులు పోలీస్ ఎన్ కౌంటర్లలో మరణించారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, ఆశన్న వంటి లీడర్లు తమ టీమ్లతో కలిసి పోలీసులకు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో దండకారణ్యంలో మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుత ఉద్యమంలో కీలకమైన నేతలు గణపతి వృద్ధాప్యం వల్ల పెద్దగా పార్టీపై ప్రభావం చూపించలేకపోతున్నారు. ఇక మిగిలిన వాళ్లలో మడవి హిడ్మా, దేవ్జీ మాత్రమే ఉద్యమానికి కీలకంగా మారారు. వీరిని పట్టుకునేందుకు నాలుగు రాష్ట్రాల పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. పార్టీ నాయకుల్లో విభేదాలు, కోవర్ట్ ఆపరేషన్లతో వీరిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు.