
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్: భైంసాలో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పోలీసులు బెదిరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భైంసా అత్యాచార మైనర్ బాధితురాలిని బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. విషయం బయటికి చెప్పొద్దని పోలీసులు బాధితురాలి కుటుంబాన్ని బెదిరించారని, ప్రతి విషయాన్ని పోలీసులు మతాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. చిన్నారిపై అత్యాచారం జరిగితే పోలీసులు వెంటనే స్పందించలేదని, చిన్నారిని కనీసం కాపాడే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. భైంసా అత్యాచారం విషయం ప్రభుత్వం బయటికి రానీయడం లేదని, సీఎం కేసీఆర్ పోలీసులను పని చేసుకోనివ్వడం లేదన్నారు. హోమ్ మంత్రి ఉన్నా లేనట్టే, అత్యాచారం కేసులో పోలీసులు నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తనకు నచ్చిన పని చేయించుకుంటున్నాడని, భైంసాలో ప్రభుత్వం ఒక వర్గానికే సపోర్ట్ చేస్తోందని విమర్శించారు. భైంసా ప్రజానికాన్ని బీజేపీ కాపాడుకుంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.