అమ్మాయిలపై దూసుకెళ్లిన పోలీస్ కారు

అమ్మాయిలపై దూసుకెళ్లిన పోలీస్ కారు
  • ఒక యువతి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

జలంధర్: రోడ్డు పక్కన నిలబడ్డ ఇద్దరు అమ్మాయిల మీదుగా పోలీస్ కారు దూసుకెళ్లడంతో ఓ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. మరో అమ్మాయి తీవ్రంగా గాయపడింది. ప్రమాదం జరిగినంక కూడా వెహికల్ ను ఆపకుండా పోలీస్ ఇన్ స్పెక్టర్  అలాగే తీసుకెళ్లిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్​గా మారింది. సోమవారం పంజాబ్ లోని జలంధర్– ఫగ్వారా హైవేపై ధనోవలీ గ్రామం వద్ద ఈ యాక్సిడెంట్​ జరిగింది. రోడ్డును దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు అమ్మాయిలు.. పోలీస్ కారు వేగంగా రావడం చూసి వెనక్కి జరిగారు. ఒకవైపు రోడ్డు ఖాళీగానే ఉన్నా.. ఆ కారు ఓవర్ స్పీడ్ తో వచ్చి డివైడర్ పక్కన నిలబడ్డ అమ్మాయిలను ఢీకొట్టి పోవడం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ప్రమాదంలో చనిపోయిన యువతిని ధనోవలీకి చెందిన నవజ్యోత్ కౌర్ గా గుర్తించారు. ఓ కార్ల షోరూంలో పనిచేస్తున్న కౌర్..​ తన ఫ్రెండ్​తో కలిసి రోడ్డు దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. యాక్సిడెంట్ లో గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. నవజ్యోత్ కౌర్ మృతి పట్ల ఆమె బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హైవేను బ్లాక్ చేసి, ధర్నాకు దిగారు. ఇన్ స్పెక్టర్ ను ఉద్యోగంలోంచి తొలగించి, మర్డర్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రమాదానికి కారణమైన ఎస్​ఐ అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు పంజాబ్ ఆర్మ్ డ్ పోలీస్​కు చెందిన 75వ బెటాలియన్ లో ఇన్ స్పెక్టర్  అని తెలిపారు.