కరోనా ఎఫెక్ట్.. చివరి చూపు కూడా చూడలేని దుస్థితి

కరోనా ఎఫెక్ట్.. చివరి చూపు కూడా చూడలేని దుస్థితి

హైదరాబాద్​, వెలుగు: ఇంటా, బయట మనుషుల మధ్య దూరం పాటించే పరిస్థితిని  తీసుకొచ్చిన కరోనా వైరస్.. చివరికి చనిపోయిన బంధువులను చివరి చూపు కూడా చూడలేని దుస్థితికి నెట్టేసింది. రాష్ట్రవ్యాప్తంగా లాక్​ డౌన్​ ప్రకటించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. వివిధ అనారోగ్య కారణాలతో దగ్గరి బంధువులు ఎవరైనా ఇతర ప్రాంతాల్లో చనిపోతే అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోతున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత ప్రకటించిన లాక్​డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఒక ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణం చేయడం సాధ్యంకావడం లేదు. కరోనా వైరస్​ నివారణ చర్యల్లో భాగంగా అడుగడుగునా పోలీస్​ చెక్​ పోస్టులు పెట్టి వెనక్కి పంపిస్తుండడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఇన్ని అడ్డంకులు దాటుకుని వెళ్లినా వచ్చేటప్పడు పరిస్థితి ఎలా మారుతుందోనని చాలా మంది తమ ప్రయాణాలు మానుకుంటున్నారు. మరో వైపు గ్రామంలో ఎవరైనా చనిపోతే సాధారణంగా వచ్చే ఇరుగుపొరుగుతోపాటు స్థానికులు అంతగా రావడం లేదు. కరోనా వైరస్​ ప్రభావంతో ఎందుకొచ్చిన బాధ అని అటువైపునకు వెళ్లడం లేదు. దీంతో కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించుకోవాల్సి వస్తోంది. డప్పు చప్పుళ్లు, డీజేలు లేకుండానే సాదాసీదాగా తీసుకెళ్తూ తతంగం  పూర్తిచేస్తున్నారు.

అంత్యక్రియల్లోనూ సోషల్ డిస్టెన్స్​..

ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించే విషయంలో కుటుంబ సభ్యులకు పోలీసులు సూచనలు చేస్తున్నారు. అంతిమయాత్రలో వీలైనంత వరకు ఎక్కువ మంది గుమికూడకుండా చూస్తున్నారు. సోషల్​ డిస్టెన్స్ పాటించాలని ​ఆదేశిస్తున్నారు. లేదంటే నేరుగా స్మశానవాటికకు తరలించాలని సూచిస్తున్నారు.

15 మందితో అంతిమ యాత్ర

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధువులు సిద్ధమవ్వగా అప్పుడే ఎంటరైన పోలీసులు అంతిమయాత్రలో తక్కువ మంది పాల్గొనాలని, డిస్టెన్స్ పాటించాలని వారికి  సూచించారు. దీంతో కేవలం 15 మందితో అంతిమ యాత్ర నిర్వహించారు.

శవాన్ని ఊర్లోకి  రానివ్వలే.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని సత్యగామ గ్రామానికి చెందిన  కుమ్మరి కృష్ణయ్య ఇటీవల అనారోగ్యంతో సికింద్రాబాద్​లోని గాంధీ హాస్పిటల్​లో అడ్మిట్ కాగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో గ్రామస్తులు శవాన్ని తీసుకొస్తున్న అంబులెన్స్​ను ఊళ్లోకి రానివ్వకుండా రాళ్లు అడ్డుగా పెట్టారు.ఊరి పొలిమేరలోనే అంత్యక్రియలు జరపాలని కోరారు. దీంతో  కృష్ణయ్య కుటుంబ సభ్యులు శవాన్ని తీసుకొని ఊర్లోకి తీసుకరాకుండానే అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.

ఐదుగురితో అంత్యక్రియలు

కరీంనగర్​లోని కోతి రాంపూర్ ప్రాంతానికి చెందిన శరత్ సింగ్  అనారోగ్యంతో చనిపోయారు. కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో రవాణా సౌకర్యం లేక ఆయన అంత్యక్రియలకు బంధువులెవరూ రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఐదుగురే మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.