వీడియో వైరల్: ఫోన్ చేస్తే ఇంటికొచ్చి బర్త్ డే చేసిన పోలీసులు

వీడియో వైరల్: ఫోన్ చేస్తే ఇంటికొచ్చి బర్త్ డే చేసిన పోలీసులు

లాక్డౌన్ తో పుట్టిన రోజుకు రాని స్నేహితులు..

ప్రస్తుత రోజుల్లో పుట్టినరోజుని ప్రతిఒక్కరూ పండుగలా జరుపుకోవడం సాధారణమైంది. చిన్నపిల్లలు కేక్ కట్ చేయడం అంటే ఓకే కానీ, ఇప్పుడు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పెద్దవాళ్లు కూడా కేకులు కట్ చేసి.. పార్టీలు కూడా ఇస్తున్నారు. బర్త్ డేలు చేసుకోవడానికి అంతలా అలవాటుపడిపోయారు ప్రజలు.

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సోషల్ డిస్టెన్సింగ్ మేలని యావత్తు ప్రపంచం చాటుతోంది. వంద కోట్లకు పైగా జనాభా ఉన్నభారత్ లోనే సోషల్ డిస్టెన్సింగ్ గురించి అవేర్ నెస్ కల్పిస్తూ అందరూ పాటించేలా చేస్తున్నాం. మరి కేవలం 30 కోట్లకు పైగా జనాభాతో మరియు రూల్స్ పక్కాగా ఫాలో అయ్యే అమెరికాలో ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. లాక్డౌన్ వల్ల అమెరికాలో ఎవరూ బయటకు రావడంలేదు. అక్కడ కరోనా వల్ల వేల మంది మరణిస్తున్నారు. దాంతో లాక్డౌన్ నిబంధనను కచ్చితంగా అమలుచేస్తున్నారు.

అయితే లాక్డౌన్ వల్ల తన కొడుకు పుట్టిన రోజుకు ఎవరూ రావడంలేదని ఏంచేయాలో తోచక.. ఓ తండ్రి స్థానిక పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో పోలీసులు ఊహించని విధంగా ఆ అబ్బాయికి బర్త్ డే విషెస్ చెప్పారు. ఆ అబ్బాయి ఇంటి దగ్గరకు పదికి పైగా పెట్రోలింగ్ వాహనాలతో సైరన్ వేసుకొని వచ్చారు. లాక్డౌన్ పాటిస్తూ.. పోలీసులు వెహికిల్ కూడా దిగకుండా.. అందులోనే కూర్చొని మైకుతో హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ పాట పాడారు. దాంతో ఆ అబ్బాయి ఆనందానికి అంతులేకుండా పోయింది. పోలీసులు ఇలా విష్ చేయడం పట్ల ఎలా ఫీలవుతున్నావని తండ్రి ఆ కొడుకును అడుగగా.. చాలా స్పెషల్ గా ఉందని ఆ అబ్బాయి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆ వీడియో చూసినవాళ్లందరూ.. పోలీసులు ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. ఏదైతేనేం ఆ అబ్బాయి మాత్రం తన పుట్టిన రోజును చాలా స్పెషల్ గా జరుపుకున్నాడని నెటిజన్లు అంటున్నారు.