
- ఎంక్వైరీ పేరిట మహారాష్ట్ర పోలీసుల దారుణం
ముంబై: ఎంక్వైరీ పేరిట మహారాష్ట్ర పోలీసులు.. జలగావ్‌లోని హాస్టల్లో ఉన్న బాలికలతో బట్టలు విప్పించి డ్యాన్స్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియో బయటపడింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీజేపీ నేతలు అసెంబ్లీ సమావేశంలో బుధవారం నిలదీశారు. పోలీసులు ఇంతటి దారుణానికి పాల్పడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ప్రశ్నించారు. జల్‌గావ్‌లో ప్రభుత్వ నేతృత్వంలోని ఆశాదీప్ మహిళల హాస్టల్లో జరిగిందీ ఘటన. కొద్ది రోజుల కిందట పోలీసులు ఎంక్వైరీ పేరిట హాస్టల్‌కి వెళ్లారు. అక్కడున్న బాలికలను బెదిరించి వారి బట్టలు విప్పించి డ్యాన్స్ చేయించారు. ఈ దారుణం గురించి తెలుసుకున్న ఓ ఎన్జీవో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
నలుగురు సభ్యులతో కమిటీ వేసిన సర్కార్
ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని, నలుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. దర్యాప్తు నివేదికను రెండ్రోజుల్లో సమర్పించాలని ఆదేశించామన్నారు. స్టేట్మెంట్లను వీడియో రికార్డింగ్ చేసి, రిపోర్టును బట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.