హైదరాబాద్, వెలుగు: తమ ప్లాట్ఫామ్ నుంచి పాలసీలు తీసుకున్న వాళ్లు ఇన్సూరెన్స్ డబ్బు పొందడంలో ఇబ్బందులు ఎదురైతే అన్ని విధాలా సాయపడతామని పాలసీ బజార్ జాయింట్ గ్రూప్ సీఈఓ సర్భవీర్ ప్రకటించారు. ఈ ప్రక్రియను సజావుగా, వేగంగా చేయడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
క్లెయిమ్ సమాధాన్ దివస్ వంటి కార్యక్రమాలు, ప్రత్యేక బృందాల ద్వారా వేల సంఖ్యలో కేసులను మళ్లీ తెరిపించామని, రూ.కోట్ల విలువైన క్లెయిమ్‌లు పరిష్కారమయ్యేలా చేశామని పేర్కొన్నారు. ఏ క్లెయిమ్ అయినా అన్యాయంగా తిరస్కరించకుండా, నిలిచిపోకుండా చూస్తామన్నారు.
హైదరాబాద్‌లో పాలసీబజార్ శుక్రవారం నిర్వహించిన 'ఇన్సూరెన్స్ కా సూపర్ హీరో’ నాలుగో ఎడిషన్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘‘జీఎస్టీ తగ్గించడంతో మా ప్లాట్ఫామ్ ద్వారా గత రెండు నెలల నుంచి పాలసీల కొనుగోళ్లు మరింత పెరిగాయి. ముఖ్యంగా ఆరోగ్య బీమా పాలసీ తక్కువ రేట్లకు దొరుకుతోంది. ఎక్కువ మంది రూ.30వేల లోపు ప్లాన్ను ఎంచుకుంటున్నారు. అయితే ప్రీ ఎగ్జిస్టింగ్డిసీజెస్ వంటి సమస్యల వల్ల క్లెయిమ్ తిరస్కరణలు పెరుగుతున్నాయి. కొన్ని కేసుల్లో మోసాలూ బయటపడుతున్నాయి”అని ఆయన వివరించారు.
