సిద్దిపేటలో పొలిటికల్ హీట్..గజ్వేల్‌పై అందరి చూపు

సిద్దిపేటలో పొలిటికల్ హీట్..గజ్వేల్‌పై అందరి చూపు
  •    మూడు సెగ్మెంట్లలో ఆసక్తికర పరిణామాలు
  •     గద్దర్ ప్రకటనతో గజ్వేల్‌పై అందరి చూపు
  •     సిద్దిపేటలో జోరుగా సేవా రాజకీయాలు
  •     హుస్నాబాద్‌పై కన్నేసిన సీపీఐ 
  •     పోటీ చేస్తామని ప్రకటించిన చాడ వెంకట్ రెడ్డి

సిద్దిపేట, వెలుగు:  సిద్దిపేట జిల్లాలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది.  మూడు నియోజకవర్గాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రజా యుద్ధ నౌక గద్దర్ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించడంతో అందరి చూపు ఆ సెగ్మెంట్‌పై పడింది.   సిద్దిపేట నియోజకవర్గంలో సేవా రాజకీయాలు ఎక్కువయ్యాయి.  మంత్రి హరీశ్‌రావును పార్లమెంట్‌కు పంపుతారని ప్రచారం జరుగుతుండడం,  ఇదే సమయంలో సీఎం కేసీఆర్ అన్న  కొడుకు వంశీధర్ రావు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతుండడం ఆసక్తి రేపుతోంది.  బీఆర్‌‌ఎస్‌ సిట్టింగ్‌ సీటైన హుస్నాబాద్‌పై సీపీఐ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌ రెడ్డి  నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 

గజ్వేల్‌పై గద్దర్ నజర్ 

కొన్నేళ్లుగా కాంగ్రెస్‌కు మద్దతివ్వడం తప్ప ఏ పార్టీలో చేరని ప్రజాయుద్ధ నౌక గద్దర్ సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది.  పోటీ చేస్తానని చెప్పడమే కాదు ఇకపై తన స్వగ్రామైన గజ్వేల్ నియోజకవర్గంలో తుఫ్రాన్‌లోనే  నివాసం ఉంటానని స్పష్టం చేశారు.  ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగుతానని గద్దర్ చెబుతున్నా ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.   హైకమాండ్ ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌‌పై పోటీకి సిద్ధమని ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందర్‌‌ రావు ప్రకటించారు. 

మళ్లీ హరీశ్‌రావు పోటీ చేయాలని తీర్మానం

బీఆర్‌‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గం ఇరవై ఏండ్లలో ఎన్నడు లేనివిధంగా అరుదైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే డబుల్ హాట్రిక్ కొట్టాడు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ముందు సందడి చేయడం తప్ప  ఏకపక్ష రాజకీయాలే  కొనసాగుతూ వచ్చాయి. కానీ, ప్రస్తుతం పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి.  ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సిద్దిపేట మాజీ మున్సిపల్  వైస్ చైర్మన్ పూజల వెంకటేశ్వరరావు ‘హరీశ్​ అన్నను ఎక్కడెక్కడికో పంపిస్తారని అంటున్రు..  

వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచే పోటీ చేయాలని తీర్మానం పెడుతున్నా సమ్మతమే అయితే  చప్పట్లు కొట్టి మద్దతివ్వండి’ అని  చెప్పడం హాట్ టాపిగ్‌గా మారింది.  మంత్రి హరీశ్​రావును మెదక్,  జహీరాబాద్ పార్లమెంట్‌కు పంపుతారనే ఊహాగానాల మధ్య  ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. దీనికి తోడు  సీఎం కేసీఆర్  అన్న  కొడుకు వంశీధర్ రావు కేఆర్‌‌ఆర్‌‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.  సీఎం కేసీఆర్ పర్మిషన్‌తో సిద్దిపేటలో అడుగుపెట్టాడనే ప్రచారం జరుగుతోంది.  

హుస్నాబాద్​లో  బహుముఖ పోరు

హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బహుముఖ పోరు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  బీఆర్‌‌ఎస్‌ కమ్యూనిస్టులతో పొత్తు నేపథ్యంలో హుస్నాబాద్ సీటు సీపీఐకే దక్కే అవకాశం ఉందని ఇప్పటి దాకా ప్రచారం జరిగింది. కానీ,  ఇటీవల హుస్నాబాద్‌కు వచ్చిన కేటీఆర్  సిట్టింగ్ ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్ కు లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వాలని పిలుపునివ్వడంతో ఈ సీటు బీఆర్‌‌ఎస్‌దేనని స్పష్టమైంది.  ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.  కొన్నాళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడమేకాదు సీఎం కేసీఆర్‌‌, మంత్రి కేటీఆర్‌‌పైనా విమర్శల దాడి చేస్తున్నారు.  బీజెపీ, కాంగ్రెస్ తో పాటు వైఎస్ఆర్ టీపీ నుంచి కూడా అభ్యర్థిని నిలిపే చాన్స్‌ ఉంది.   ప్రజలు సతీశ్​ కుమార్‌‌కు హ్యాట్రిక్ విజయం అందిస్తారా..? ప్రతిపక్ష పార్టీలకు పట్టం కడతారా..? చూడాలి.