రాజకీయ భీష్ముడు కాకా : గవర్నర్ తమిళిసై

రాజకీయ భీష్ముడు కాకా : గవర్నర్ తమిళిసై
  • అంబేద్కర్ పేరుతో ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూషన్స్ ఏర్పాటు గొప్ప నిర్ణయం: గవర్నర్​
  • అంబేద్కర్ ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూషన్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు, కాకా వర్ధంతి కార్యక్రమానికి హాజరు 

హైదరాబాద్ / ముషీరాబాద్ వెలుగు: “దేశ రాజకీయాల్లో కాకా వెంకటస్వామి భీష్ముడు లాంటి వ్యక్తి. చేపట్టిన పదవులకు ఆయన వన్నె తెచ్చారు. పేదల కోసం అంబేద్కర్ పేరుతో ఎడ్యుకేషనల్​  ఇన్​స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయడం అనేది గొప్ప నిర్ణయం. ఇప్పుడు డొనేషన్స్ కోసమే కొందరు ఇన్​స్టిట్యూషన్స్ నడిపిస్తున్నారు. కానీ, డొనేషన్స్ లేకుండా అంబేద్కర్ ఇన్​స్టిట్యూషన్స్ నడిపించడం అభినందనీయం” అని గవర్నర్ తమిళిసై అన్నారు. పేదల కోసం కాకా ఎంతో కృషి చేశారని, ప్రైవేట్ రంగంలో పెన్షన్ తీసుకరావటంతో పాటు సింగరేణి కాలరీస్ కు, రామగుండం ఫెర్టిలైజర్​ కంపెనీకి ఆయన చేసిన కృషి మరువలేనిదని గుర్తుచేశారు. గురువారం హైదరాబాద్​ బాగ్ లింగంపల్లిలో డా. బీఆర్ అంబేద్కర్  ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూషన్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. కాకా చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. వివిధ కోర్సుల్లో ర్యాంకులు సాధించిన స్టూడెంట్లకు మెమెంటోలు, షీల్డ్ లు అందజేశారు. గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూషన్స్ గోల్టెన్ జూబ్లీ వేడుకలకు హాజరవడం సంతోషంగా ఉందన్నారు. ‘‘ఇక్కడ ఉన్న వారంతా భవిష్యత్ పిల్లర్స్. ఈ ఇన్​స్టిట్యూషన్స్ ను సరోజ వివేకానంద్​ నడిపించడం అభినందనీయం. మహిళలు హెడ్ లుగా ఉన్న ఇన్​స్టిట్యూషన్స్ సక్సెస్ అవుతున్నాయి. మహిళలు అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తే అది ఎప్పుడు సక్సెస్ గా నిలుస్తుంది. అందుకు సరోజ వివేకానంద్​ నిదర్శనం” అని గవర్నర్​ పేర్కొన్నారు. తల్లిదండ్రులను, టీచర్లను గౌరవించాలని స్టూడెంట్లకు సూచించారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి తన పేరెంట్స్, టీచర్స్ కారణమని గవర్నర్  గుర్తుచేసుకున్నారు. 

తెలంగాణ ఉద్యమంలో కాకాది కీలక పాత్ర: మురళీధర్ రావు

దేశంలోనే గొప్ప రాజకీయ నేత కాకా అని, 1969 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నడిపి  రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. 

ఇన్​స్టిట్యూషన్స్ పై ఎంతో శ్రద్ధపెట్టేవారు: సరోజ 

అంబేద్కర్  ఎడ్యుకేషనల్​ ఇన్​​స్టిట్యూషన్స్ అంటే కాకా ఎంతో శ్రద్ధ చూపించేవారని ఇన్​స్టిట్యూషన్స్ కరస్పాడెంట్ సరోజ వివేకానంద్​ గుర్తుచేశారు. చనిపోవటానికి కొన్ని రోజుల ముందు కూడా ఇన్​స్టిట్యూషన్స్ అడ్మిషన్స్, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారని ఆమె తెలిపారు.  అంబేద్కర్ ఇన్​స్టిట్యూషన్స్ అటానమస్, డీమ్డ్ యూనివర్సిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.  

బుక్స్ అందజేసిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఇన్​స్టిట్యూషన్​లోని 10వ తరగతి స్టూడెంట్లకు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బుక్స్​ అందజేశారు.  గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఏర్పాటు చేసిన కాకా వెంకటస్వామి ఫొటో ఎగ్జిబిషన్  ఆకట్టుకుంది.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి,  కాకా కుమారుడు, అంబేద్కర్  ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూషన్స్ సెక్రటరీ గడ్డం వినోద్, విశాక జేఎండీ గడ్డం వంశీకృష్ణ, వైష్ణవి, వెంకట్​ తదితరులు పాల్గొన్నారు. 

జ్ఞాపకాలు యాదికితెచ్చుకున్న ఓల్డ్​ స్టూడెంట్స్​ 

2000 బ్యాచ్​కు  చెందిన పూర్వ విద్యార్థులు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని వివేక్ వెంకటస్వామి, సరోజ దంపతులు అభినందించారు. అప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని, 2000 సంవత్సరంలో ఇక్కడ ఎల్​ఎల్​బీలో చేరి మూడు సంవత్సరాలు చదువుకున్నానని హైకోర్టు అడ్వకేట్ కె. విజయలక్ష్మి గుర్తుచేసుకున్నారు.  

పేదల కోసం తపించేవారు: వివేక్​ వెంకటస్వామి

కాకా ఎప్పుడూ పేదల కోసం తపించేవారని, ఎంతో మందికి ఇండ్ల జాగాలు వచ్చేలా కృషి చేశారని  ఆయన కుమారుడు, విద్యా సంస్థల చైర్మన్​, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘మా నాన్న ఇల్లు ఇక్కడి(బాగ్​ లింగంపల్లి)కి సమీపంలోనే ఉండేది. ఈప్రాంతానికి ఆయన నిత్యం వాకింగ్​కు వచ్చేవారు. తర్వాత ఇక్కడ అంబేద్కర్ ఇన్​స్టిట్యూషన్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చదువుతున్న స్టూడెంట్లలో మెజారిటీ వారు పేదవాళ్లే” అని వివరించారు. గోల్డెన్ జూబ్లీ వేడుకలకు, కాకా వర్ధంతి కార్యక్రమానికి గవర్నర్ హాజరవటం చాలా సంతోషకరమని అన్నారు.