బ్రిటన్‌‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం

బ్రిటన్‌‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం

లండన్‌‌: బ్రిటన్‌‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రధాని లిజ్‌‌ ట్రస్‌‌ను వారంలో పదవి నుంచి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార కన్జర్వేటివ్‌‌ పార్టీకి చెందిన 100 మందికిపైగా ఎంపీలు ట్రస్‌‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన పత్రాలను సమర్పించేందుకు రెడీగా ఉన్నట్లు డైలీ మెయిల్‌‌ ఓ కథనంలో పేర్కొంది. ట్రస్‌‌పై అవిశ్వాస తీర్మానానికి వెంటనే ఓటింగ్‌‌ నిర్వహించేందుకు వీలుగా రూల్స్‌‌ మార్చాలని కన్జర్వేటివ్‌‌ పార్టీ కమిటీ హెడ్‌‌ గ్రాహమ్‌‌ బ్రాడీని ఎంపీలు కోరారు. అయితే, దీనికి బ్రాడీ ఒప్పుకోలేదని సమాచారం.

అక్టోబర్‌‌‌‌ 31న ప్రవేశపెట్టబోయే బడ్జెట్​లో మరో ఆర్థిక వ్యూహాన్ని రూపొందించేలా ట్రస్‌‌కు, జెరెమీ హంట్‌‌కు మరో అవకాశం ఇద్దామని బ్రాడీ ఎంపీలకు సూచించినట్లు డైలీ మెయిల్‌‌ వెల్లడించింది. మరోవైపు, ట్రస్ స్థానంలో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కొంతమంది సభ్యులు చర్చలు జరిపినట్లు టైమ్స్‌‌ తన నివేదికలో పేర్కొంది. ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రస్‌‌.. తన విధానాలతో దేశాన్ని ఆర్థిక వ్యవస్థను కుప్పకూలేలా చేశారని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు. దీంతో ఆమె పదవి నుంచి దిగిపోవాలని సొంత పార్టీ నేతలే డిమాండ్‌‌ చేస్తున్నారు.