- ముదిరాజ్ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా కుమారుడిని నియమించిన ఎమ్మెల్సీ
- గౌడ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా మాజీ మంత్రి సన్నిహితులు
హైదరాబాద్, వెలుగు: బీసీ ఆత్మగౌరవ భవనాలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను తమ సొంత ఆస్తిలాగా కొంత మంది నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. మరో వైపు ఆత్మగౌరవ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కుల సంఘాల నేతలను కాదని, కుటుంబసభ్యులను, అనుచరులను నియమించారు. రాష్ర్టంలో 58 బీసీ కులాలకు కోకాపేట, ఉప్పల్ భగాయత్, మేడ్చల్ లో ప్రభుత్వం భూములు కేటాయించింది. జనాభా ఆధారంగా 5 ఎకరాలు, 3,2,1 ఎకరం చొప్పున కేటాయించింది.
భవన నిర్మాణానికి నిధులు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించి రిలీజ్ చేయలేదు. కురుమ, ముదిరాజ్ భవనం మాత్రమే పూర్తి కాగా మిగతావి ప్రారంభం కాలేదు. ఇటీవల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ జీవో పత్రాలను ఆయా సంఘాల ప్రతినిధులకు అందచేశారు. ఈనెలలో భవన నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. కురుమ భవన్ కు కోకాపేటలో ప్రభుత్వం 5 ఎకరాలను కేటాయించింది.
ఇందులో ఎకరం భూమిని ఓ కార్పోరేట్ ఇంటర్ కాలేజీకి ఆ సామాజిక వర్గ ఎమ్మెల్సీ కట్టబెట్టారు. కాలేజ్ బిల్డింగ్ కు శంఖుస్ధాపన సైతం చేశారు. ఈ విషయం బయటకు రావటంతో కురుమ నేతలు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇక పలు సంఘాల ఆత్మగౌరవ భవనాలకు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కొందరు తమ కుటుంబసభ్యులను నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ తన కుమారుడిని ట్రస్ట్ బోర్డు మెంబర్ గా నియమించారు. మరో మాజీ మంత్రి గౌడ ఆత్మగౌరవ భవన ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా తన పార్టీ అనుచరులను నియమించుకున్నారు. దీంతో ఈ నియామకాలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.
గైడ్ లైన్స్‌తో చెక్ పెట్టిన ప్రభుత్వం
ప్రభుత్వ భూమిని ప్రైవేట్ కాలేజీలకు కట్టబెట్టడంపై కురుమ సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించడం, ఉన్నత న్యాయస్థానం గైడ్ లైన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఇటీవల ఆత్మగౌరవ భవనాల నిర్వహణపై సమగ్రంగా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆత్మగౌరవ భవనాలు, భూమిపై పూర్తి హక్కులు బీసీ సంక్షేమ శాఖవేనని స్పష్టం చేసింది. అద్దె, లీజు, అమ్మకం లాంటివి నిషేదం అని పేర్కొంది. ప్రతి ఆత్మగౌరవ భవనానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్ గా, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, కార్పోరేషన్ ఎండీతో పాటు కుల సంఘం నుంచి ఒక ప్రతినిధి ఉంటారని పేర్కొంది.
