మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

మధ్యప్రదేశ్ లో వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఎం కమల్ నాథ్ ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ సన్నిహితుడు అశ్విన్ శర్మకు చెందిన భోపాల్ నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. రెండు రోజుల తనిఖీల్లో ఐటీ అధికారులు 14. 6కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన డాక్యుమెంట్లు, డైరీలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ఒక ప్రధాన పార్టీ కార్యాలయానికి 20కోట్ల రూపాయల నగదు వచ్చినట్లు సమాచారం రావడంతోనే దాడులు చేసినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు.

మరోవైపు మధ్యప్రదేశ్ లో దాదాపు 281 కోట్ల రూపాయల ధనాన్ని పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, కొన్ని సంస్థల అధినేతలు.. ఒక రాకెట్ నుంచి సేకరించినట్లు వచ్చిన సమాచారం మేరకే దాడులు జరిగినట్లు సమాచారం. మూడు రోజులుగా జరుగుతున్న సోదాలు మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతున్నాయి. విపక్ష నేతలను బీజేపీ కావాలనే టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఐటీ, ఈడీలను బీజేపీ నిర్వీర్యం చేస్తుందని మండిపడుతోంది. బీజేపీ మాత్రం ఐటీ దాడులకు కేంద్రంతో సంబంధం లేదని చెబుతోంది.