రాజకీయ శూన్యత గుర్తించే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతుండు

రాజకీయ శూన్యత గుర్తించే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతుండు

మహబూబాబాద్ జిల్లా: దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ శూన్యతను గుర్తించి కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. కేసీఆర్ నిర్ణయానికి అనేక జాతీయ పార్టీలు మద్దతిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఆకలి చావులు జరుగుతున్నా.. బీజేపీ ప్రభుత్వం కేవలం మత పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని ఆరోపించారు. అన్ని మతాల కులాల వేదిక అయిన దేశంలోని పేదోళ్లకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పధకం అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ దేశ సంపద అంతా కొద్ది మంది చేతుల్లో పెడుతున్నారని విమర్శించారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇంకా లేవలేని స్థితిలో ఉందన్నారు. 
దేశమంతా విద్యుత్ కోతలు ఉన్నా.. తెలంగాణ రాష్ట్రంలో లేవని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. దేశంలో బీజేపీకి ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని రెచ్చిపోతున్నారని, దోచుకోవడమే పనిగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె విమర్శించారు. బీజేపీ కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పుతున్నడని ఆమె స్పష్టం చేశారు. గిరిజన రిజర్వేషన్లపై  అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రంలో బీజేపీ ఆమోదం తెలపడం లేదన్నారు. తండాలను గూడేలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ దేనని తెలిపారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ కోసం 350 ఎకరాల స్థలాన్ని కేటాయించినా నేటి వరకు కేంద్రం నిధులు ఇవ్వలేదని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.