రాజకీయ నాయకులు హుందాగా మాట్లాడాలి.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

రాజకీయ నాయకులు హుందాగా మాట్లాడాలి.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • బూతులు మాట్లాడడం ఫ్యాషనైపోయింది
  • ‘విలీనం, విభజన, మన ముఖ్యమంత్రులు’ పుస్తకావిష్కరణలో వెంకయ్య నాయుడు 

బషీర్​బాగ్, వెలుగు: బూతులు మాట్లాడటం రాజకీయ నాయకులకు ఫ్యాషనైపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బూతులు మాట్లాడడం చాలా గొప్ప అనుకుంటున్నారని, ప్రజలు మనల్ని గమనిస్తున్నారనే విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు. భాష హుందాగా ఉండాలని, భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. 

మంగళవారం బషీర్ బాగ్ దేశోద్దారక భవన్ లో సీనియర్ సంపాదకులు ఇనగంటి వెంకట్రావు రాసిన ‘విలీనం, విభజన, మన ముఖ్యమంత్రులు’ పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, పుస్తక రచయిత ఇనగంటి వెంకట్రావు, సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, బండారు శ్రీనివాస్ తో కలసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. విలీనం-, విభజన, మన ముఖ్యమంత్రులు.. పుస్తకాన్ని యువత తప్పకుండా చదవాలని సూచించారు.  మన వ్యూస్ ను న్యూస్ గా  ప్రెజెంట్ చేయకూడదని, దాని కోసం వేరే కాలమ్స్ ఉన్నాయన్నారు. పత్రికలు సమాజానికి దర్పణం లాంటివని, సమాజంలో ఏం జరుగుతున్నదో ప్రజలకు చెప్పాలన్నారు. 

చాలా మంది జర్నలిస్టులు కొత్తగా యూట్యూబ్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, పాత్రికేయంలో భాష చాలా ముఖ్యమని అన్నారు. జీవితంలో రెండు సార్లు కంటతడి పెట్టానని చెప్పారు. తాను అమ్మను చూడలేదని, అది గుర్తుకు వచ్చినప్పుడు కంటతడి పెడతానని చెప్పారు. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలిచి ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేసినప్పుడు కూడా కంటతడి పెట్టినట్టు చెప్పారు. 

తనకు రాజకీయాల్లో నుంచి బయటకు రావడం ఇష్టం లేదని, ఉప రాష్ట్రపతిగా దిగిపోయిన నాటి నుంచి పార్టీ ఆఫీస్ గుమ్మం తొక్కలేదని తెలిపారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇనగంటి వెంకట్రావు ఒక తరం జర్నలిస్టులకు స్ఫూర్తి అని అన్నారు. ఆయన రచించిన విలీనం, -విభజనను పుస్తకం అనడం కంటే కూడా మంచి నవల అని చెప్పొచ్చన్నారు.