సిరివెన్నెల మృతికి రాజకీయ నాయకుల నివాళులు

సిరివెన్నెల మృతికి రాజకీయ నాయకుల నివాళులు

కేసీఆర్
ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ శ్రీ చేంబోలు (సిరివెన్నెల) సీతారామశాస్త్రి మరణం పట్ల సీఎం కే. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం తెలిపారు. సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని అన్నారు. ఆయన మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వైఎస్ జగన్
తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

గవర్నర్ తమిళిసై
ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన కుటుంబానికి మరియు అభిమానులకు ప్రగాఢ సానుభూతి.

చంద్రబాబు నాయుడు
అద్భుత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దాదాపు 3000లకు పైగా పాటలు రాసి సంగీత ప్రియులను అలరించిన పద్మశ్రీ సీతారామశాస్త్రి గారి మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటు. సీతారామశాస్త్రి గారి ఆత్మశాంతికై భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

బీజేపీ కిషన్ రెడ్డి
సమకాలీన తెలుగు కవులు & సాహిత్యకారులలో ఒకరైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ ఐకాన్ అయిన సిరివెన్నెల సాహిత్య రచనలు చాలా మందిని తాకాయి. ఆయన కుటుంబానికి నా సానుభూతి.

రేవంత్ రెడ్డి
ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆకస్మిక మరణం తెలుగు సినిమా రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటు.  నా ప్రగాఢ సంతాపం వ్యక్తం  చేస్తున్నా. ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్న.  సీతారామ శాస్త్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

హరీష్ రావు
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అకాల మరణం బాధాకరం. ఆయన రాసిన ప్రతీ పాట తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది. ఎన్నో భావగర్భితమైన పాటలు రాసి.. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక, సాహిత్య, ఆధ్యాత్మికతపై ఎన్నో పాటలు రాసి తెలుగు ప్రజానికానికి ఎన్నో కొత్తతరం సాహిత్య పాటలను పరిచయం చేశారు. తెలుగు సాహిత్య, సంగీత, సినీ ప్రేక్షకులకు వారి మరణం తీరనిలోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.

వైసీపీ విజయసాయి రెడ్డి
ప్రఖ్యాత తెలుగు సినీ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆకస్మిక మరణం అత్యంత బాధాకరం. తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన కవి సామ్రాట్ ఆయన. సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
 
రోజా
'జగమంత కుటుంబం'లో మీ చోటు ఎప్పటికీ పదిలం. ప్రతి తెలుగు వారి మదిలో మీరు రచించిన సాహిత్యం రూపంలో చిరస్థాయిగా నిలిచి ఉంటారు. 

మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి
సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటి రాగాల ఆ కోయిలమ్మ కు నల్లటి రంగు ఏమిటి అంటూ ప్రశ్నించిన ఆ స్వరం ఇంత త్వరగా శాశ్వత నిద్రలోకి జారుకుంటుందని ఉహించలేకపోయాను అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన మరణం పట్ల నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. 

తలసాని శ్రీనివాస్ యాదవ్
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. సిరివెన్నెల రాసిన ప్రతి పాట ఒక ఆణిముత్యం. ఆయన మృతితో చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప గేయ రచయితను కోల్పోయింది.

సీతక్క
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని అంత ధైర్యంగా అనగలిగిన సినీ కవి ఇకలేరేమో. తన కలం ఎన్ని భావాలను పలికించిందో కదా!  మూడు వేల గీతాలను రాసిన ఆ కలం ఆగిపోయిందంటే నమ్మలేకుండా ఉంది. నిత్య నూతనమై ఆయన పాట శ్రోతల హృదయాలకు తాకాలని కోరుకుంటారు. ఆయనకు నా ఘన నివాళులు.