
- కాంగ్రెస్‌లో చేరడానికి అభిప్రాయాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే బండ్ల ష్ణమోహన్ రెడ్డి
- చేర్చుకోవద్దంటూ సెల్ టవర్ ఎక్కిన యువకుడు
- పెట్రోల్ పోసుకున్న మరో ఇద్దరు
- పలుచోట్ల కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకోలు
గద్వాల, వెలుగు : గద్వాలలో రాజకీయాలు గరం గరంగా మారాయి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతుండగా, వద్దంటూ హస్తం పార్టీ లీడర్లు గురువారం గద్వాలతో పాటు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నిరసనలతో హోరెత్తించారు. కాంగ్రెస్‌లో చేరాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, లీడర్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకువస్తుండగా, ఆయన రెండు రోజుల నుంచి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నారు.
దీంతో ఎమ్మెల్యేను చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం గద్వాలలోని కుంటవీధికి చెందిన ప్రసాద్ లింగం కాలనీలోని సెల్ టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని మద్దతుగా నిరసన తెలిపారు. డీఎస్పీ సత్యనారాయణ, ఎస్సై అక్కడికి చేరుకొని ప్రసాద్‌ను సముదాయించి కిందికి దింపే ప్రయత్నం చేశారు.
అయినా అతడు వినలేదు. ఇదే సందర్భంలో అక్కడే దౌదర్పల్లికి చెందిన అనిల్, అనంతపురానికి చెందిన రహీం పెట్రోల్ పోసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ లీడర్లు, పోలీసులు అడ్డుకొని నీళ్లు పోయడంతో ప్రమాదం తప్పింది. అందరినీ శాంతింపజేసిన పోలీసులు చివరకు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రసాద్‌ను రిక్వెస్ట్ చేయడంతో కిందికి దిగి వచ్చాడు. కేటీ దొడ్డి మండల కేంద్రంలో కూడా కృష్ణ అనే కాంగ్రెస్కార్యకర్త పెట్రోల్ పోసుకున్నాడు. పోలీసులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు అడ్డుకొని నీళ్లు పోసి అక్కడి నుంచి తీసుకెళ్లారు.
పార్టీలో చేరాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి
కాంగ్రెస్‌లో చేరాలంటూ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు మూడు రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. పలు గ్రామాల, మండలాల లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరాలంటూ వినతి పత్రాలు ఇస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. రెండు రోజులుగా పార్టీ క్యాడర్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. 14వ తేదీలోగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేది ఖాయమని ఆయన అనుచరులు చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా నిరసన
బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ లింగంబాగు కాలనీ నుంచి పాత బస్టాండ్ కు చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్ చౌరస్తా దగ్గర రోడ్డుపై బైఠాయించారు. అక్కడి నుంచి కలెక్టరేట్ ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కోర్టు సర్కిల్ ఎదురుగా నిరసన తెలిపారు. అదేవిధంగా ధరూర్, గట్టు, కేటీ దొడ్డి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలిచ్చి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను,లీడర్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇబ్బందులకు గురి చేశాడని, ఆయనను పార్టీలో చేర్చుకుంటే సహించేది లేదని నినాదాలు చేశారు.