ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్..?

ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్..?
  • రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రతిపక్షాల చర్చ
  • ఏకగ్రీవం కోసం నడ్డా, రాజ్ నాథ్ ప్రయత్నాలు
  • విపక్షాలతో చర్చలకు బీజేపీ కసరత్తు
  • ఈనెల 15న ఢిల్లీలో ప్రతిపక్షాలతో దీదీ చర్చలు
  • ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్ కసరత్తు 

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో దేశ రాజకీయాలు హీటెక్కాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్.. విపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు తీవ్రంంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు కేంద్రానికి ధీటుగా బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు శరద్ పవార్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ ఉద్దండులైన శరద్ పవార్ ఎంపిక రాష్ట్రపతి అభ్యర్థిగా బాగుంటుందని దాదాపు అన్ని విపక్షాలు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ కూడా శరద్ పవార్ వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. 

వచ్చే నెలలో (జూలై 18న) జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బరిలో ఉంటారని తాజా రాజకీయ పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలను ముమ్మరం చేశాయి. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేలా బీజేపీ ప్లాన్ చేస్తుండగా.. మోడీ సర్కార్ ను దీటుగా ఎదుర్కొనేందుకు సరైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు విపక్ష పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా వ్యూహా, ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. విపక్షాలు నిర్వహిస్తున్న సమావేశాలను బట్టి తమ ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ నే రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని కాంగ్రెస్ కూడా తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే గురువారం (ఈ నెల 9న) శరద్ పవార్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సలహా, సూచనతో ముంబై వెళ్లి..శరద్ పవార్ ను కలిసి చర్చలు జరిపారు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంతి ఎంకే స్టాలిన్ తోనూ ఇప్పటికే మల్లిఖార్జున ఖర్గే చర్చలు జరిపారు. ఇటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ ఫోన్ లో మాట్లాడారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సూచనతో ఆప్ నేత సంజయ్ సింగ్ కూడా ఆదివారం (జూన్ 12న) శరద్ పవార్ ను కలిసి, రాష్ట్రపతి ఎన్నికపైనే ప్రధానంగా చర్చించారని సమాచారం. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికపై ఈనెల 15వ తేదీన ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలన్నింటితోనూ మమతా బెనర్జీ సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే 22 విపక్ష పార్టీలకు దీదీ లేఖలు రాశారు. ఈ ఎన్నికలపై విపక్షాలు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే.. ఈనెల 15నాటికి ఏయే పార్టీలు మమత నిర్వహించే సమావేశానికి హాజరుకానున్నాయి అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

శరద్ పవార్.. దేశంలోనే చాలా సీనియర్ రాజకీయ నాయకులు. అనేక పార్టీల మధ్య పొత్తులు నడిపారు. సంకీర్ణ ప్రభుత్వాలను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించిన అనుభవం చాలా ఉంది. మహారాష్ట్రలో సైద్ధాంతిక వైరుధ్యాలు కలిగిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లను బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకొచ్చి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా శరద్ పవార్ కే దక్కిందంటారు రాజకీయ నిపుణులు. 

ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు


రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ (ఎన్డీఏ సర్కార్ ) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే రంగంలోకి దిగి..తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పార్టీలతో చర్చించి..ఏకాభిప్రాయ సాధన దిశగా చర్చలు జరిపే యోచనలో ఉన్నారు. రాజ్‌నాథ్‌కు పార్టీలకు అతీతంగా అందరు నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. ప్రస్తుతం జేడీయూ, అప్నాదళ్, అన్నాడీఎంకే, ఎల్​జేపీ, జేజేపీ, ఈశాన్య రాష్ట్ర పార్టీలైన ఎన్‌పీపీ, ఎన్​పీఫ్​, ఏజీపీ పార్టీలు ఎన్​డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. స్వతంత్రంగా ఉంటున్న వైఎస్ ఆర్ సీపీ, బీజేడీ పార్టీలతోనూ జేపీ నడ్డా, రాజ్​నాథ్  సింగ్ సంప్రదింపులు జరపనున్నారు. 2017లో రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఏకాభిప్రాయం కోసం బీజేపీ..రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడుని (ప్రస్తుత ఉప రాష్ట్రపతి) నియమించింది. అయితే.. ఆ తర్వాత వెంకయ్యనాయుడునే ఎన్డీయే తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిపిన విషయం తెలిసిందే. 

ఏకాభిప్రాయం కుదరకపోతే బీజేపీ నెక్ట్స్ ప్లాన్ 
ఒకవేళ ఈ సారి ప్రతిపక్షాలతో చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోతే బీజేపీ రాష్ర్టపతి ఎన్నికకు సిద్ధం కానుందని తెలుస్తోంది. అధికార పార్టీ నుంచి చాలా మంది సీనియర్ల పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకూ దీనిపై బీజేపీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.  

జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరగనున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్లతో ఎలక్టోరల్ కాలేజీ ఆధారంగా రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్ర జనాభా, అసెంబ్లీ స్థానాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీ మొత్తం బలం 10,86,431. ఏ అభ్యర్థి అయినా 50 శాతం ఓట్లు దాటితే గెలుస్తారు. 

రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు..?
రాష్ట్రపతి పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది నామినేట్ చేసినట్లయితే.. కొత్త అధ్యక్షుడి కోసం జూలై 18న ఓటింగ్ నిర్వహించి, జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 4,809 మంది ఓటర్లు ఉండగా, వారిలో 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు ఉండనున్నారు. వీరిలో 223 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు, ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితో సహా అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు రాష్ర్టపతిని ఎన్నుకుంటారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.