స్టేషన్​ ఘన్​పూర్​లో హీటెక్కుతున్న రాజకీయం

స్టేషన్​  ఘన్​పూర్​లో హీటెక్కుతున్న రాజకీయం
  • తన వర్గం నేతలతో వరుస మీటింగ్​లు
  • ముందుంది మంచికాలమంటూ భరోసా
  • అధిష్టానం ఆశీస్సులున్నట్లు సంకేతాలు
  • బర్త్​ డే గ్రాండ్​ సెలెబ్రేషన్స్​ కు ఏర్పాట్లు

జనగామ, వెలుగు :జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కుతోంది. మాజీ డిప్యూటీ సీఎంలు కడియం,  రాజయ్యల మధ్య వర్గ పోరు నెలకొంది. గత కొంత కాలంగా నివురుకప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి, మళ్లీ రాజుకుంటోంది. కడియం శ్రీహరి వర్గం యాక్టివ్​ అవుతోంది. కడియం తన అనుచరులతో వరుస మీటింగ్​లు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా ప్రతీ రోజు ఒకటి రెండు మండలాలకు చెందిన లీడర్లతో భేటీ అవుతున్నారు. అధిష్టానం నుంచి హామీ ఉందని.. ముందుంది మంచికాలం అంటున్నట్లు అనుచరులు చెప్పుకొస్తున్నారు. పరోక్షంగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్​ వస్తుందని.. శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని దిశా నిర్దేశం చేస్తున్నట్లు చెబుతున్నారు.

వరుస మీటింగ్​లు
మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గత మూడు రోజులుగా తన అనుచరులతో భేటీ అవుతున్నారు. ఇప్పటి వరకు రఘునాథపల్లి, చిల్పూరు, స్టేషన్​ ఘన్​పూర్​, వేలేరు, జఫర్​ఘడ్​ మండల లీడర్లతో సమావేశం అయినట్లు శ్రేణులు చెప్పాయి.  హనుమకొండలోని తన నివాసంలో సమావేశమవుతున్నారు. స్టేషన్​ ఘన్​పూర్​ కు ఎమ్మెల్యే కావాలనే తన ఆకాంక్షను శ్రేణులతో పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే నియోజవర్గంలో ఓ వెలుగు వెలిగిన ఆయన.. ప్రస్తుతం రాజయ్య వర్గంతో అసౌకర్యానికి గురవుతున్నారు. ఒక దశలో తన నియోజకవర్గంలోకి పర్మిషన్​ లేకుండా ఎంటర్ కావొద్దని ఎమ్మెల్యే రాజయ్య వార్నింగ్​ ఇవ్వడంతో విబేధాలు తారస్థాయికి చేరాయి. ఇక నుంచి రెండు వర్గాల మధ్య రచ్చ పెరగడం ఖాయంగా చెబుతున్నారు. మాటల దాడులు షురూ కానున్నట్లు రాజయ్య వర్గం అంటోంది. ఈ ఇరువురి మధ్య అంతర్గత పోరుతో పార్టీ లో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయోననే చర్చ జరుగుతోంది. 

బర్త్​ డే కు గ్రాండ్​ ఏర్పాట్లు​
కడియం తన వర్గీయులను బూస్టప్​ చేసేందుకు పక్కా ప్లాన్​ తో ముందుకు సాగుతున్నట్లు శ్రేణులు అంటున్నాయి. రాష్ర్టంలో ఎన్నికల వాతావరణం షురూ అయిన నేపథ్యంలో ఘన్​పూర్​లో శక్తియుక్తుల కోసం కార్యాచరణ మొదలైందంటున్నారు. ఎమ్మెల్యే రాజయ్య వర్గంతో అమీతుమీకి సిద్ధం అవుతున్న సంకేతాలను ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇటీవల నిర్వహించిన పీకే రిపోర్ట్​లో రాజయ్యకు వ్యతిరేక పవనాలు ఉన్నట్లు కడియం వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో కడియంకు మార్గం సుగమం అయిందంటున్నారు. అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చినందునే మండలాల లీడర్లతో భేటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో ఎన్నడూ నిర్వహించని విధంగా ఈ సారి కడియం జన్మదిన వేడుకలను చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈనెల 8న ఘన్​పూర్​ హెడ్​క్వార్టర్​లో భారీ వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న రాజయ్య వర్గం ప్రస్తుతానికైతే సైలెంట్​గా ఉన్నా లోలోన అంతర్మథనం చెందుతోంది.  ఈ వర్గ పోరు ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్​ టాపిక్​ గా మారింది.