
- ఎత్తైన కొండలు, వాటిపై నుంచి జారిపడే జలపాతాలు...
- కొబ్బరి తోపులు, తేయాకు పొలాలు, పచ్చికమైదానాలు, మెలికలు తిరిగిన దారులు...
- అదే ప్రశాంతతకు, ప్రకృతి సోయగాలకు కేరాఫ్ అయిన పొల్లాచి.
పొల్లాచి.. తమిళనాడులోని కోయంబత్తూ ర్ జిల్లాలో ఉంది. ఇది కోయంబత్తూర్‌కి 40 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఆ జిల్లాలోనే అతి పెద్ద ఊరు ఇది. ఇక్కడ బెల్లం, కూరగాయలు, పశువుల మార్కెట్లు చాలా పాపులర్. కోయంబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్‌లో జరిగే నిత్య శివారాధనలు పొల్లాచి వరకు వెన్నంటే వస్తాయి. ఆకాశాన్నంటే అతి ఎత్తైన ఆదియోగి... శివుడి విగ్రహాన్ని చూసేందుకు భక్తులతోపాటు టూరిస్ట్‌లు కూడా వెళ్తుంటారు.
అక్కడంతా ఆ కల్చరే
పొల్లాచి అనే పేరు ‘పొళిల్ వైత్చి’ అనే తమిళ పదం నుంచి వచ్చింది. అంటే ‘అందంతో కూడిన బహుమతి’ అని దానర్థం. వాడుకలో పొళిల్ వైత్చి కాస్తా పొల్లాచిగా మారింది. అయితే, దీన్ని చోళుల కాలంలో ‘ముది కొండ చోళ నళ్లూర్’ అని కూడా పిలిచేవారు. పొల్లాచిలో ట్రైబల్ కల్చర్ కనిపిస్తుంది. ఎందుకంటే కదర్, మలస, ముదువ, పులైయా, మలైమలస, ఎరవల్లన్ వంటి తెగలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్లలో హిందూ, క్రిస్టియన్, సిక్, బౌద్ధ, ఇస్లాం, జైన మతాలు పాటించేవాళ్లున్నారు. పొల్లాచి ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడతారు. వాటితోపాటు కొబ్బరి, బెల్లం, కూరగాయలు, పశువుల వ్యాపారాలు చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో వెనిల్లా కూడా పండిస్తారు. అంతేకాదు.. సినిమా షూటింగ్‌లకు కూడా పొల్లాచి పాపులర్ లొకేషన్. ఇక్కడ ఫిబ్రవరి ‘క్యాటిల్ ఫెస్టివల్’ కన్నుల పండుగగా జరుగుతుంది. అందులో భాగంగా కొందరు రైతులకు బహుమతులు ఇస్తారు. ప్రతి గురువారం పొల్లాచి ఫెయిర్ ఉంటుంది. ఆ రోజు రకరకాల బట్టలు, ధాన్యాలు, కూరగాయలు, నూనెలు అమ్ముతారు.
చూడాల్సినవి :
అన్నామలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ.. ఇక్కడికి వెళ్లాలంటే పొల్లాచి నుంచి రెండుగంటల పైనే జర్నీ చేయాల్సి ఉంటుంది. అక్కడకు మూడు కిలో మీటర్ల దూరంలో టాప్‌స్లిప్ టైగర్ రిజర్వ్ ఉంటుంది. వైల్డ్ లైఫ్ శాంక్చురీలో రోజ్‌వుడ్, టేక్‌వుడ్, వెదురు వంటి చాలా రకాల చెట్లు కనిపిస్తాయి.
ఆలయాలు
అరివు తిరుకొవిల్.. అంటే టెంపుల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ ప్రదేశం పొల్లాచి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదొక యోగా ఇనిస్టిట్యూట్. ఈ సెంటర్లో ప్రతి రోజూ రెండు సెషన్స్ జరుగుతాయి. ఒకటి ఉదయం, రెండోది సాయంత్రం నుంచి రాత్రి వరకు. అలాగే, ఇక్కడ అరుల్మిగు సుబ్రహ్మణ్య తిరుకొయిల్ టెంపుల్ కూడా ఉంది. ఈ గుడి ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళ్లాలంటే పొల్లాచి నుంచి 57 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఈ టెంపుల్లో చాలా రకాల సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఇక్కడికి వెళ్తే ఇవే కాకుండా మరికొన్ని ఆలయాలు కూడా చూడొచ్చు.
పరంబికులం టైగర్ రిజర్వ్.. ఈ రిజర్వ్ పొల్లాచి నుంచి 44 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ పక్షులు, జంతువులు చాలా ఉంటాయి. వాటితోపాటు లోకల్ ట్రైబ్స్ కూడా ఉంటారక్కడ.
అన్నామలై కొండలు.. ట్రెక్కింగ్ ఇష్టపడేవాళ్లకు ఇది బెస్ట్ ప్లేస్. పశ్చిమ కనుమల వైపు నుంచి కొండలు ఎక్కితే అద్భుతమైన పశ్చిమ ప్రాంతమంతా చూడొచ్చు.
వలపరై హిల్ స్టేషన్.. ఇది పొల్లాచి నుంచి 65 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఆ దారి అంతటా తేయాకు సువాసనలమయం. టీ, కాఫీ ఎస్టేట్లు పచ్చదనంతో ఉంటాయి. ఈ హిల్ స్టేషన్‌కి చుట్టుపక్కల చాలా డ్యామ్‌లు ఉంటాయి.
మంకీ ఫాల్స్.. పొల్లాచికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. పేరుకు తగ్గట్లే ఇక్కడ కోతులు కూడా ఎక్కువే. దీనికి దగ్గరల్లోనే అజియార్ డ్యాం ఉంది. ఈ వాటర్ ఫాల్స్ చూసేందుకు తరచూ టూరిస్ట్‌లు వెళ్తుంటారు.
లోమ్స్ వ్యూ పాయింట్.. అలియర్ వలపరై కొండ దగ్గర్లో ఉన్న మలుపును లోమ్స్ పాయింట్ అంటారు. మ్యాథ్యూ లోమ్ అనే వ్యక్తి1886లో కొండ పై నుంచి ఈ దారి కనుక్కున్నాడు. అందుకే అప్పటి నుంచి దీనికి ఆ పేరొచ్చింది. ఇది అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్‌గా ఆకట్టుకుంటోంది.
అలియర్ డ్యాం.. ఇది కూడా పొల్లాచిలోని టూరిస్ట్ ప్లేస్ల్లో ఒకటి. ఇది వాటర్ రిజర్వాయర్ మాత్రమే కాదు. ఇక్కడ పార్క్, గార్డెన్, బోటింగ్, అక్వేరియంతో పాటు పిల్లలు ఆడుకునేందుకు ప్లేస్ కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బెస్ట్ పిక్నిక్ పాయింట్.
ఇలా వెళ్లాలి
పొల్లాచి చేరుకోవాలంటే ముందుగా కోయంబత్తూర్ వెళ్లాలి. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్‌కి విమానం, సికింద్రాబాద్ నుంచి రైలు మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి రైలు లేదా లోకల్ బస్సులు లేదా అద్దె ట్యాక్సీలు వంటివి అందుబాటులో ఉంటాయి. మొత్తం తిరిగి చూడ్డానికి నాలుగు రోజులు లేదా వారం పడుతుంది.