ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు .. జనవరి 29న పోలింగ్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు .. జనవరి 29న పోలింగ్
  • షెడ్యూల్​ రిలీజ్ ​చేసిన ఈసీ.. 11న నోటిఫికేషన్
  • కడియం శ్రీహరి, కౌశిక్​రెడ్డి రాజీనామాతో రెండు సీట్లకు ఉప ఎన్నిక

న్యూఢిల్లీ / హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్​ జరగనుంది. తెలంగాణలో రెండు, యూపీలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి స్టేషన్​ఘన్​పూర్ నుంచి, పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వాళ్లు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఆ సీట్లు ఖాళీ అయ్యాయి. వారిద్దరి పదవీకాలం 2027 నవంబర్​30 వరకు ఉండటంతో ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్​ రిలీజ్​ చేసింది. ఈ నెల 11న నోటిఫికేషన్​ జారీ చేయనుంది. ఆ రోజు నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుంది. 19న నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు ఉంటుంది.

ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ఆవరణలో పోలింగ్​నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి ఒకటో తేదీతో పూర్తికానుంది.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కే చాన్స్..

అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్​కు 64 మంది, బీఆర్ఎస్​కు 39 మంది, బీజేపీకి 8 మంది ఉన్నారు. ఎంఐఎంకు ఏడుగురు, సీపీఐకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ఒక్క సెట్​నామినేషన్​దాఖలు చేయడానికి 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాలి. ఈ లెక్కన నామినేషన్లు దాఖలు చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్​కు మాత్రమే అవకాశముంది. సభ్యుల సంఖ్యాబలం రీత్యా కాంగ్రెస్, బీఆర్ఎస్​ఒక్కో స్థానాన్ని గెలిచుకునే చాన్స్ ఉంది. కాంగ్రెస్​నుంచి ఇద్దరు, బీఆర్ఎస్​నుంచి ఒక్కరు నామినేషన్​దాఖలు చేస్తే పోలింగ్​అనివార్యమవుతుంది. రెండు పార్టీల నుంచి ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్​వేస్తే నామినేషన్ల ఉప సంహరణ గడువు పూర్తయిన తర్వాత వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.