- 9 కీలక పోస్టులు.. బరిలో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ ప్యానళ్లు
- ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ కూటముల మధ్యే టఫ్ ఫైట్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థి సంఘం ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా సాగిన హోరాహోరీ ప్రచారం ముగియడంతో, యూనియన్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. క్యాంపస్‌లోని మొత్తం 5,900 మంది విద్యార్థి ఓటర్లు బ్యాలెట్ ద్వారా తమ తీర్పును ఇవ్వనున్నారు.
సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా, క్యూలైన్లలో రద్దీని బట్టి మరో గంట సమయం పొడిగించే అవకాశముంది. ఎన్నికల్లో యూనియన్ పరిధిలోని 9 కీలక సెంట్రల్ ప్యానెల్ పోస్టులతో పాటు 13 స్కూళ్ల పరిధిలోని 59 స్కూల్ బోర్డు కౌన్సిలర్ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది.
వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 220 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల బరిలో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ ప్యానళ్లు పోటీ పడుతున్నప్పటికీ.. ప్రధాన సమరం మాత్రం ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ, ఏఐఎస్ఏ నేతృత్వంలోని కూటమికి, ఏబీవీపీ, ఎస్ఎల్వీడీ ప్యానెల్‌కే మధ్యే రసవత్తరంగా సాగుతోంది.
క్యాంపస్‌లో తమ పట్టును నిలుపుకోవాలని లెఫ్ట్ కూటమి సర్వశక్తులూ ఒడ్డుతుండగా, ఈసారి ఎలాగైనా యూనియన్‌ను కైవసం చేసుకోవాలని ఏబీవీపీ పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోంది. ప్రెసిడెంట్ పోస్టుకు ఏబీవీపీ ప్యానెల్ నుంచి నరేష్, ఎస్ఎఫ్ఐ ప్యానెల్ నుంచి దిల్షాదా, ఎన్ఎస్ యూఐ ప్యానెల్ నుంచి నవీన్ కుమార్ పోటీలో ఉన్నారు. మంగళవారం ఉదయం 10:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
