కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్

కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్
  • కర్నాటక బళ్లారి జిల్లా సంగనకల్లు  ప్రత్యేక పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్న రాహుల్ గాంధీ
  • ఢిల్లీలోని ఏఐసీసీ సహా దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలు
  • ఓటు హక్కును వినియోగించుకోనున్న 9వేల మంది ఏఐసీసీ డెలిగేట్లు
  • 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరగడం ఇది ఆరోసారి

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం సహా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 65 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, పి. చిదంబరం, జైరాం రమేష్ తదితరులు ఓటు వేశారు. అధ్యక్ష ఎన్నికలో పార్టీకి చెందిన 9 వేల మంది పీసీసీ డెలిగేట్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు కలిపి 75 మంది ఏఐసీసీ కార్యాలయంలో ఓటేయనున్నారు. మరో 280 మంది పీసీసీ డెలిగేట్స్ ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీసులో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

ఇక రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కోసం గాంధీ భవన్ లో ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ తొలి ఓటు వేశారు. అనంతరం జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత్ జోడో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా సంగనకల్లు క్యాంపులో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ కు తరలించనున్నారు. ఈ నెల 19 పోలైన ఓట్ల లక్కింపు చేపట్టి, ఫలితాలు ప్రకటిస్తారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శశిథరూర్, మల్లికార్జున ఖర్గే పోటీ చేస్తున్నారు. అయితే పార్టీలో సీనియర్లు చాలా మంది ఖర్గేకే మద్దతు ఇస్తున్నారు. దీంతో ఆయన గెలుపు లాంఛనమేనంటున్నారు నేతలు. ఇద్దరిలో ఎవరు గెలిచినా కలిసి పనిచేస్తామన్నారు శశిథరూర్. ఖర్గే, తన భావాజాలంలో ఏమాత్రం తేడా లేదని, పనిచేసే విధానంలోనే తేడా ఉంటుందన్నారు స్పష్టం చేశారు. మల్లికార్జున ఖర్గే సీనియర్ నేత అని పేర్కొన్న  ఆయన గెలిస్తే సహజంగానే తాను సహకరిస్తానని శశిథరూర్ పునరుద్ఘాటించారు. 

137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరగడం ఇది ఆరోసారి మాత్రమే. సోనియా, రాహుల్, ప్రియాంక బరిలో లేకపోవడంతో 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబాలకు చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానున్నారు.