
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మే 13 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది.
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్స్, ఇంక్, ఓటరు లిస్టు తదితర ఎన్నికల సామాగ్రి తీసుకుని సిబ్బంది ఆదివారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు పొలిటికల్ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని ఈసీ ఈసారి పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలను అన్ని రకాలుగా చెకింగ్ చేసిన తర్వాత 1,05,019 బ్యాలెట్యూనిట్లు, 44,569 కంట్రోల్యూనిట్లు, 48,134 వీవీప్యాట్లు పోలింగ్ కోసం సిద్ధం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిలో 90 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనుంది. దాదాపు 10 వేల పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి, ఆయా చోట్ల మూడంచెల భద్రత కల్పించింది. ఈ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలతోనూ నిఘా పెట్టింది. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించబోమని స్పష్టం చేసింది. కాగా, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, స్వేచ్ఛగా ఓటు వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటు వేయాలని కోరారు.
3 లక్షల మంది సిబ్బంది
ఈసారి పోలింగ్విధుల్లో దాదాపు 2 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. 12,909 మంది మైక్రో అబ్జర్వర్లు.. 3,522 మంది సెక్టార్, రూట్ఆఫీసర్లు.. 1,200 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, రెండొందల మందికి పైగా మానిటరింగ్ ఆఫీసర్లు ఉన్నారు. ఎస్ఎస్ టీ, వీడియో సర్వైలెన్స్ టీమ్స్ కూడా ఉన్నాయి. ఇక ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. బందోబస్తు విధుల్లో 72 వేల మంది రాష్ట్ర పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 20 వేల మంది సిబ్బంది ఉన్నారు. వీరితో పాటు 160 కేంద్ర కంపెనీల బలగాలు, ఎక్సైజ్, ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ల నుంచి 7 వేల మంది బందోబస్తు విధుల్లో ఉన్నారు. మొత్తంగా దాదాపు లక్ష మంది పైనే భద్రత విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు అన్ని రకాలుగా కలిపి రూ.320 కోట్ల విలువైనవి సీజ్చేశారు.
సికింద్రాబాద్ లో 45 మంది పోటీ
రాష్ట్రంలోని 17 లోక్ సభనియోజకవర్గాల్లో వివిధ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి 45 మంది పోటీ పడుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో చేవెళ్ల, మెదక్, పెద్దపల్లి, వరంగల్స్థానాలు ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ నుంచి 12 మంది పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్అన్ని సీట్లలో పోటీ చేస్తుండగా, కొన్నిచోట్ల బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. భువనగిరి నుంచి సీపీఎం అభ్యర్థి పోటీ చేస్తున్నారు. మొత్తం అభ్యర్థుల్లో 474 మంది పురుషులు కాగా, 51 మంది మహిళలు ఉన్నారు.
యువత, మహిళల ఓట్లే కీలకం
రాష్ట్రంలో మొత్తం 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో 1,65,28,366 మంది పురుషులు కాగా.. 1,67,01,192 మంది మహిళలు ఉన్నారు. మరో 2,760 మంది థర్డ్ జెండర్. ఇక కొత్తగా ఓటు హక్కు పొందినోళ్లు 9,20,313 మంది ఉన్నారు. అత్యధికంగా మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో 37,60,958 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా మహబుబాబాద్ సెగ్మెంట్లో 16,26,427 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 900 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఈసారి ఎన్నికల్లో యువత, మహిళలు కీలకంగా మారనున్నారు. వాళ్లు ఎటువైపు మొగ్గు చూపితే, ఆ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.