నాలుగో విడతలో 96 సీట్లకు..ఇయ్యాల 10 రాష్ట్రాలు, యూటీల్లో పోలింగ్​

నాలుగో విడతలో 96 సీట్లకు..ఇయ్యాల 10 రాష్ట్రాలు, యూటీల్లో పోలింగ్​
  • బరిలో 1,717 మంది అభ్యర్థులు
  • ఆంధ్రప్రదేశ్​లో  175,  ఒడిశాలో 28 అసెంబ్లీ సీట్లకూ ఎన్నికలు
  • ఓటేయనున్న 17.70 కోట్ల ఓటర్లు
  • 1.92 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • ఎన్నికల విధుల్లో 19 లక్షల మంది సిబ్బంది

న్యూఢిల్లీ, వెలుగు : లోక్ సభ నాలుగో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 96 లోక్‌‌సభ సీట్లకు సోమవారం పోలింగ్  జరగనుంది. తెలంగాణలో మొత్తం 17 సీట్లు, ఆంధ్రప్రదేశ్​లో మొత్తం 25 సీట్లు, ఉత్తర ప్రదేశ్​లో 13, మహారాష్ట్రలో 11, బిహార్​లో 5, జార్ఖండ్​లో 4, మధ్యప్రదేశ్ లో 8, ఒడిశాలో 4, బెంగాల్​లో 8, జమ్మూకాశ్మీర్​లో ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏపీలో మొత్తం 175 సీట్లకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనుండగా..

ఒడిశాలో మొత్తం 147 సీట్లలో 28 స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని చోట్లా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్  నిర్వహించనున్నారు. తెలంగాణలో ఓటింగ్ ను బట్టి సమయాన్ని పెంచుతామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 96 లోక్‌‌సభ స్థానాల్లో 64 జనరల్, 12 ఎస్టీ, 20 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. ఈ 96 స్థానాలకు 1,717 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. తెలంగాణలోని 17 స్థానాలకు అత్యధికంగా 523 మంది బరిలో నిలిచారు. ఇక 17.70 కోట్ల మంది ఓటర్లు నాలుగో విడతలో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

వారిలో 8.97 కోట్ల మంది పురుషులు, 8.73 కోట్ల మహిళలు  ఉన్నారు.12.49 లక్షల మంది 85 ఏళ్లు పైబడి ఉన్నారు.19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1.92 పోలింగ్  కేంద్రాలు ఏర్పాటు చేశారు. 19 లక్షల మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. 

ప్రముఖ అభ్యర్థులు వీరే..

లోక్ సభ నాలుగో దశ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో.. యూపీలోని కనౌజ్  నుంచి అఖిలేశ్​, బిహార్ లోని బెగూసరాయ్  నుంచి గిరిరాజ్  సింగ్, ఉజియార్ పూర్  నుంచి నిత్యానంద్  రాయ్, బెంగాల్ లోని బహరాంపూర్  నుంచి కాంగ్రెస్  నేత అధిర్  రంజన్  చౌధురి, మాజీ క్రికెటర్  యూసుఫ్​ పఠాన్, మహారాష్ట్రలోని బీడ్  నుంచి బీజేపీ అభ్యర్థి పంకజ్  ముండే, తెలంగాణలోని హైదరాబాద్  నుంచి అసదుద్దీన్  ఒవైసీ, కడప నుంచి వైఎస్   షర్మిల పోటీచేస్తున్నారు. అలాగే, కేంద్ర మంత్రి అజయ్  కుమార్  మిశ్రా లఖింపూర్  ఖేరీ నుంచి బరిలో నిలిచారు.

అవినీతి కేసులో లోక్ సభ నుంచి బహిష్కరణకు గురైన మహువా మొయిత్రా బెంగాల్ లోని కృష్ణానగర్ నుంచి మళ్లీ ఎన్నికయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ నటుడు శత్రుఘ్న  సిన్హా కాంగ్రెస్  తరపున అసన్ సోల్ లో బీజేపీ అభ్యర్థి అహ్లువాలియాపై పోటీచేస్తున్నారు. అలాగే బెంగాల్ బీజేపీ చీఫ్​ దిలీప్  ఘోష్, కాంగ్రెస్  నేత, మాజీ క్రికెటర్  కీర్తి ఆజాద్.. వర్ధమాన్  దుర్గాపూర్  నుంచి పోటీచేస్తున్నారు.

370 రద్దు తర్వాత కాశ్మీర్​లో తొలి ఎన్నికలు

2019లో ఆర్టికల్  370 రద్దుచేసిన తర్వాత జమ్మూకాశ్మీర్ లో మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో దశలో శ్రీనగర్  స్థానానికి పోలింగ్  నిర్వహిస్తున్నారు. దాదాపు 17.48 లక్షల మంది ఓటర్లు ఓటేయనున్నారు. నేషనల్  కాన్ఫరెన్స్  తరపున షియా లీడర్  సయ్యద్  రుహుల్లా, పీడీపీ తరపున వహీద్  పారా, అప్నీ పార్టీ తరపున అష్రఫ్​ మిర్  పోటీచేస్తున్నారు. కాగా, బీజేపీ నుంచి ఎవరూ పోటీచేయడం లేదు. కాగా, సోమవారం పోలింగ్  జరగనున్న 96 సీట్లలో ఎన్డీఏ నుంచి 40 మంది సిట్టింగ్  ఎంపీలుగా ఉన్నారు.

సాధారణంగానే వాతావరణం : ఐఎండీ

నాలుగో దశ పోలింగ్  జరగనున్న 96 సీట్లలో వాతావరణం సాధారణంగానే ఉంటుందని, వేడిగాలులు వీచే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అయితే, తెలంగాణలో గత వారం తీవ్రమైన వేడి,వడగాలుల నేపథ్యంలో పోలింగ్  సమయాన్ని పెంచామని ఎన్నికల సంఘం వెల్లడించింది.