
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని బంజారా భవన్లో శనివారం 2,300 మందికి పైగా ప్రిసైడింగ్ అధికారులు (పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవో), ఇతర పోలింగ్ అధికారులకు (ఓపీవో) మొదటి విడత శిక్షణ నిర్వహించారు. అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఎన్నికల్లో పీవో, ఏపీవో, ఓపీవోలది కీలకపాత్రని, తమ బాధ్యతలపై పూర్తి అవగాహనతో ఉండాలన్నారు.
పోలింగ్ రోజు కేంద్రం లోపల, బయట కార్యకలాపాలు, ఈవీఎం, వీవీ ప్యాట్ల అనుసంధానం, మాక్ పోల్ తదితర అంశాలపై సూచనలు చేశారు. ఎన్నికల సంఘం హ్యాండ్‌బుక్‌ను తప్పనిసరిగా చదవాలని, అందులోని నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పోలింగ్ ముందు రోజు చెక్‌లిస్ట్ తయారు చేసుకోవాలని, సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారులను సంప్రదించాలన్నారు. ఈ శిక్షణలో సునంద, మమత పాల్గొన్నారు.