యాదాద్రిలో​ స్లోగా మొదలై వేగం పుంజుకున్న పోలింగ్

యాదాద్రిలో​ స్లోగా మొదలై వేగం పుంజుకున్న పోలింగ్

యాదాద్రి, వెలుగు: మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్ యాదాద్రి జిల్లాలో​ స్లోగా మొదలై సాయంత్రానికి వేగం పుంజుకుంది. జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లోని 122 సెంటర్లలో  ఉదయం  6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి, 7 గంటలకు పోలింగ్​ మొదలుపెట్టారు. ప్రచారం జరిగిన స్థాయిలో డబ్బులు అందకపోవడంతో చాలామంది ఓటర్లు ఉదయం ఓటు వేయడానికి రాలేదు. ఎవరైనా వచ్చి పైసలు ఇస్తే వెళ్దాం అన్నట్టుగా ఇంటి వద్దే కూర్చున్నారు. 11 గంటల వరకూ చౌటుప్పల్​ మండలంలో 23.23  శాతం, సంస్థాన్​ నారాయణపురం మండలంలో 21 శాతం మాత్రమే ఓట్లు పోల్​అయ్యాయి. దీంతో పొలిటికల్​ లీడర్లు ఆందోళనకు గురయ్యారు. వెంటనే కొందరు కొందరు లీడర్లు డైరెక్ట్​గా ఓటర్ల ఇండ్లకు వెళ్లి ఓటు వేయడానికి రావాలని కోరారు. 

చెప్పిందెంత..? ఇస్తున్నదెంత?

‘ప్రచారం జరిగినట్టు డబ్బులు ఇస్తమన్నది ఎంత? ఇప్పుడు మాకు ఇస్తున్నది ఎంత? అని ఓటర్లు లీడర్లను నిలదీశారు. ‘మీరంతా బాగానే ఉన్నారు. పైసలకు ఓట్లు అమ్ముకున్న బద్నాం మాత్రం మమ్ములను చేశారు’ అని అన్నారు. దీంతో గతంలో ఇచ్చిన సొమ్ముకు అదనంగా మరో రూ.వెయ్యి నుంచి రూ. రెండు వేల వరకు ఇస్తామని చెప్పినా కొందరు వినలేదు. మరికొందరు మాత్రం ఓట్లు వేయడానికి ముందుకొచ్చారు. దీంతో వారిని ఆటోల్లో పోలింగ్​సెంటర్లకు తరలించారు. అక్కడ మళ్లీ డబ్బులు అడగడంతో సెంటర్​కు కొద్ది దూరంలో ఆపి డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాతే వారు ఓటు వేయడానికి లోపలికి వెళ్లారు. దీంతో పాటు హైదరాబాద్​లో ఉన్న ఓటర్లకు ఫోన్​చేసి రావాలని కోరారు. అయితే అప్పటివరకు ఇస్తానని చెప్పిన, లేదా ఇచ్చిన రూ. 3, రూ.4 వేలకు అదనంగా ఎంత ఇస్తారో చెబితేనే వస్తామని చెప్పినట్టు తెలిసింది. దీంతో లీడర్లు దీనికి ఒప్పుకొని రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకూ ఇస్తామని అంగీకరించినట్టు తెలిసింది. కొంతమందికి ఫోన్​ పే, గూగుల్​పే కూడా చేశారు. దీంతో మధ్యాహ్నం తర్వాత పోలింగ్​సెంటర్లకు ఓటర్ల తాకిడి ఎక్కువైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 42 శాతం ఓటింగ్​నమోదు కాగా, సాయంత్రం 6 గంటల వరకు 79.91 శాతం నమోదైంది. టైం ముగిసే వరకూ క్యూలో ఉన్న ఓటర్లకు అవకాశం కల్పించి గేట్లు మూసివేశారు.