ఇయాల్నే (ఫిబ్రవరి 11) పోలింగ్..ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్కు ఎన్నికలు

ఇయాల్నే (ఫిబ్రవరి 11) పోలింగ్..ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్కు ఎన్నికలు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
  • పటిష్ట పోలీసు బందోబస్తు 
  • డిస్ట్రిబ్యూషన్​ సెంటర్లను సందర్శించిన కలెక్టర్లు

మహబూబ్​నగర్/నాగర్​కర్నూల్/వనపర్తి/గద్వాల/ఆమనగల్లు, వెలుగు : మున్సిపల్​ఎన్నికలకు వేళైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్​నగర్​ కార్పొరేషన్​తో పాటు నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు, నాగర్​కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత, దేవకరద్ర, భూత్పూర్, గద్వాల, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాల్టీలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి.

బ్యాలెట్​ పద్ధతిలో ఎన్నికల నిర్వహించనుండగా, పోలింగ్​ ప్రక్రియ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. 13న ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించనున్నారు. 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్​ పర్సన్, వైస్​ చైర్​పర్సన్​ఎన్నికలను నిర్వహించి, మున్సిపల్​ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 

డిస్ట్రిబ్యూషన్​ సెంటర్ల విజిట్​.. 

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఉన్న పోలింగ్​ మెటీరియల్​ డిస్ర్టిబ్యూషన్​ సెంటర్లను ఆయా జిల్లాల కలెక్టర్లు విజయేందిర బోయి, సిక్తా పట్నాయక్, బదావత్​ సంతోష్, ఆదర్శ్​సురభి, సంతోష్​మంగళవారం తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి లోటు పాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని సూచించారు.

చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిందా? లేదా? అన్నది జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో బందోబస్తు ఉండాలన్నారు.

ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఆర్వో, స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తేవాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను సైతం పరిశీలించిన కలెక్టర్లు, సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని, ఒక్క సెకను కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని చెప్పారు. 

పటిష్ట బందోబస్తు

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్​ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు భూత్పూర్, దేవరకద్ర మున్సిపాల్టీల పరిధిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 1,148  మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నట్లు మహబూబ్​నగర్​ ఎస్పీ డి.జానకి తెలిపారు. గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు డిస్ట్రిబ్యూషన్​ కేంద్రాలను పరిశీలించారు.

కాగా, నారాయణపేటలో మంగళవారం టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సొంత డబ్బుతో సిబ్బంది అవసరాల కోసం టూత్ బ్రష్, టూత్ పేస్ట్, సోప్, షాంపూ, షేవింగ్ కిట్, వాటర్ బాటిల్, పెన్, దువ్వెన, ఫేస్ మాస్క్, నాప్కిన్స్ తదితర అవసరమైన వస్తువులతో ప్రత్యేకంగా కిట్లు సిద్ధం చేశారు. ఈ కిట్లను ఎస్పీ వినీత్​ బందోబస్తులో పాల్గొంటున్న సిబ్బంది అందించారు.