చత్తీస్​గఢ్​లో ఫస్ట్ ఫేజ్​ ప్రశాంతం..70% మంది ఓటేసిన్రు

చత్తీస్​గఢ్​లో ఫస్ట్ ఫేజ్​ ప్రశాంతం..70% మంది ఓటేసిన్రు
  •    లక్ష మంది పోలీసు భద్రత మధ్య ఎలక్షన్లు
  •     20 స్థానాలకు ఎన్నికలు పూర్తి
  •     భారీగా తరలి వచ్చి పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం
  •     ఈ నెల 17న మిగిలిన 70 స్థానాలకు పోలింగ్

రాయ్​పూర్ : చత్తీస్​గఢ్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 70.87 శాతం పోలింగ్ నమోదైంది. సుక్మా, కాంకర్ జిల్లాల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. పోలింగ్ ఆపేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. మొత్తం మూడు చోట్ల దాడులు చేశారు. రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్నీ స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 10 స్థానాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకల్లా ముగిసింది.

మిగిలిన 10 స్థానాల్లో 8 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 వరకు పోలింగ్ కొనసాగింది. స్టేట్ పోలీసులు, పారా మిలిటరీ బలగాల పహారా మధ్య ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ స్టేట్ చీఫ్, బస్తర్ ఎంపీ దీపక్, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మోహన్, సావిత్రి మాండవితో పాటు పార్టీ అభ్యర్థులంతా తమ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

20 స్థానాల్లో బరిలో 223 మంది అభ్యర్థులు

బీజేపీ అభ్యర్థులు, మాజీ మంత్రులు కేదార్ కశ్యప్, మహేశ్, విక్రమ్ ఉసెండి, లతా ఉసెండితో పాటు పలువురు క్యాండిడేట్లు ఓటు వేశారు. బీజేపీ మాజీ సీఎం రమణ్ సింగ్ రాజ్​నంద్​గావ్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గిరీశ్ దేవాంగన్ బరిలో ఉన్నారు. గిరీశ్.. స్టేట్ మినరల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్​గా వ్యవహరిస్తున్నారు. 2018లో నక్సలిజం నుంచి బయటికొచ్చి పోలీస్ ఫోర్స్​లో జాయిన్ అయిన మహిళా కానిస్టేబుల్ సుమిత్రా సాహు నారాయణ్​పూర్​లో ఓటేశారు. 2018, డిసెంబర్​లో జనజీవన స్రవంతిలో కలిసినట్లు వివరించింది. 2019, జనవరిలో పోలీస్ ఫోర్స్​లో జాయినైనట్లు తెలిపింది.

ఫస్ట్ తాను ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెప్పింది. పోయిన వారం నక్సలైట్ల చేతిలో చనిపోయిన బీజేపీ లీడర్ రతన్ దూబే ఫ్యామిలీ మెంబర్స్ నారాయణపూర్ జిల్లాలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి విడతగా 20 స్థానాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 223 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వారిలో 25 మహిళలు ఉన్నారు. మొత్తం 20 స్థానాల్లో లక్ష మంది పోలీసులను మోహరించారు. బస్తర్ డివిజన్​లోనే 60వేల మంది విధులు నిర్వహించారు. ఇక మిగిలిన 70 స్థానాలకు పోలింగ్ ఈ నెల 17న జరగనుంది.

మూడు చోట్ల దాడులు

ఎన్నికలు అడ్డుకునేందుకు భద్రతా బలగాలే లక్ష్యంగా నక్సల్స్ దాడి చేశారు.మంగళవారం సుక్మా జిల్లాలోని తోండమర్కా ఏరియాలో ఐఈడీ బ్లాస్ట్ చేశారు. ఈ ఘటనలో సీఆర్​పీఎఫ్ కోబ్రా బెటాలియన్​కు చెందిన ఓ జవాన్ గాయపడ్డాడు. కాంకెర్ జిల్లాలో నక్సల్స్ పోలింగ్ కేంద్రంపై ఫైరింగ్ చేశారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో నక్సల్స్​ గాయపడ్డారు. కొంత మంది జవాన్ల కు గాయాలయ్యాయి. కాంకెర్ జిల్లాలో జరిగి న మరో ఐఈడీ దాడిలో పోలింగ్ సిబ్బంది, బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. రెంగగొండి వద్ద నక్సలైట్లు ఐఈడీతో దాడికి పాల్పడ్డారు. వారిని వెంటనే హాస్పిటల్​కు తరలించారు. అందరూ సేఫ్​గానే ఉన్నారనిడాక్టర్లు తెలిపారు.