చావు.. ఏడేళ్లు స్పీడు: కాలుష్యంతో 48 కోట్ల మంది ఆయుష్షులో కోత

చావు.. ఏడేళ్లు స్పీడు: కాలుష్యంతో 48 కోట్ల మంది ఆయుష్షులో కోత

కాలుష్యంతో 48 కోట్ల మంది ఇండియన్ల ఆయుష్షులో కోత

అవును, కాలుష్యం మనిషి ఆయుష్షును బాగా తగ్గించేస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏళ్లకేళ్లు మన ఆయుష్షులో కోత పెడుతోంది. ఒక్క కాలుష్యం వల్లే దేశంలో దాదాపు 48 కోట్ల మంది ఆయుర్దాయం 7 ఏళ్లు తగ్గుతుందట. పంజాబ్​, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, చండీగఢ్​, బీహార్​, పశ్చిమబెంగాల్​ (సింధు గంగా పరివాహకం – ఐజీపీ బెల్ట్​) వంటి రాష్ట్రాల స్ట్రెచ్​లోనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అమెరికాకు చెందిన షికాగో యూనివర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్​ (ఎపిక్​– ఈపీఐసీ).. సర్వే చేసి ఈ హెచ్చరిక చేస్తోంది. అంటే దేశ జనాభాలో 40 శాతం మంది ఆయుష్షులో కోత పడుతోంది.

2011 జనాభా లెక్కల ప్రకారం మనోళ్ల సగటు ఆయుర్దాయం 67 ఏళ్లు కాగా, 2013–2017 మధ్య 69 ఏళ్లకు పెరిగిందని ఇటీవల చేసిన శాంపిల్​ రిజిస్ట్రేషన్​ సర్వేలో తేలింది. అయితే, ఇప్పుడు కాలుష్యం వల్ల ఏడేళ్లు కోత పడి 62 ఏళ్లకు పడిపోతుందని ఎపిక్​ సర్వే హెచ్చరించింది.

కాలుష్యంలో మనమే సెకండ్​

ప్రపంచంలోని 225 దేశాల ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​ (ఏక్యూఐ)పై ఎపిక్​ సర్వే చేసింది. పీఎం (పార్టిక్యులేట్​ మ్యాటర్​) 2.5 స్థాయిల లెక్కలు తీసింది. పీఎం 2.5 కాలుష్యం ఎక్కువగా ఉన్న ఆ దేశాల జాబితాలో మన దేశం రెండో స్థానంలో నిలిచింది. సగటున మన దేశంలో పీఎం 2.5 స్థాయిలు 54.18 మైక్రోగ్రాములుగా ఉన్నట్టు స్టడీ తేల్చింది. ఈ జాబితాలో 55.16 మైక్రోగ్రాములతో నేపాల్​ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్​ 53.23, చైనా 39.5, పాకిస్థాన్​ 37.01 మైక్రోగ్రాములతో టాప్​ 5 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ జనాభాలో ఇండియా, చైనా జనాభా వాటా 36 శాతం కాగా, పీఎం కాలుష్యం వల్ల ఆయువు కోల్పోతున్న 73 శాతం మంది అక్కడే ఉన్నారని స్టడీ వివరించింది.

14 సిటీల్లో 10 ఏళ్లకుపైనే కోత

ఐజీపీ బెల్ట్​లో 1998 నుంచి 2016 వరకు కాలుష్యం 72 శాతం పెరిగినట్టు ఎపిక్​ స్టడీ వివరించింది. స్టడీ కోసం 2016 వరకు ఉన్న లెక్కలనే ఎపిక్​ పరిగణనలోకి తీసుకుంది. ఈ మూడేళ్ల లెక్కలనూ తీసుకుంటే మనోళ్ల ఆయుర్దాయం మరింత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 1998లో ఈ బెల్ట్​లోని జనాల ఆయుర్దాయం తగ్గింది కేవలం 3.7 ఏళ్లేనని ఎపిక్​ పేర్కొంది. ఇప్పుడు 14 సిటీల్లోని జనాల ఆయుష్షు 10 ఏళ్లకు పైనే తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం గ్యాస్​చాంబర్​గా ప్రకటించిన ఢిల్లీ కూడా ఉంది. ఢిల్లీ జనం సగటున 10.2 ఏళ్లు తగ్గుతుందని చెప్పింది. ఈ జాబితాలో ఒక్క ఉత్తర్​ప్రదేశ్​లోనే 12 సిటీలుండడం గమనార్హం. ఆ తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్​ ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. యూపీలోని హాపూర్​, బులంద్​షహర్​ జనాల ఆయుష్షులో 11.18 ఏళ్లు, 11.13 ఏళ్లు కోత పడుతుందని సర్వే హెచ్చరించింది.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి