పొంగల్ గ్లోబల్ ఫెస్టివల్.. రైతుల కష్టానికి ప్రతీక: ప్రధాని మోడీ

పొంగల్ గ్లోబల్ ఫెస్టివల్.. రైతుల కష్టానికి ప్రతీక: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: రైతుల కష్టానికి ప్రతీక పొంగల్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనకు అన్నీ సమకూర్చే భూమాత, సూర్యుడికి మనమంతా కృతజ్ఞతగా ఉండాలని పొంగల్  బోధిస్తుందన్నారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్.మురుగన్  నివాసంలో నిర్వహించిన పొంగల్  వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. తమిళ సమాజానికి చెందిన ప్రముఖులు, పరాశక్తి సినిమా నటీనటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

మరికొద్ది నెలల్లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళ ప్రముఖులతో కలిసి మోదీ పొంగల్  వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొంగల్ గ్లోబల్ ఫెస్టివల్  అని పేర్కొన్నారు. ‘‘రైతుల శ్రమను పొంగల్  చాటిచెబుతుంది. అలాగే భూమి, సూర్యుడికి కృతజ్ఞతగా ఉండాలని, ప్రకృతితో అనుసంధానం కావాలని ఈ పండుగ మనకు నేర్పుతుంది. ప్రపంచవ్యాప్తంగా పొంగల్ ను తమిళులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 

ఈ సందర్భంగా తమిళుల మధ్య ఉంటూ పొంగల్ ను సెలబ్రేట్  చేసుకోవడం నాకెంతో గర్వంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో తమిళ సంస్కృతి కూడా ఒకటి. నేటి భారతం తమిళ సంస్కృతి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతున్నది. ప్రకృతి, 
కుటుంబ, సమాజం మధ్య సామరస్యమైన సమతుల్యాన్ని మెయింటెయిన్  చేయాలన్నదే పొంగల్  సందేశం” అని మోదీ వ్యాఖ్యానించారు.

గ్రామీణులతో పెనవేసుకున్న పండుగ

వ్యవసాయం, శ్రమించే రైతులు, గ్రామీణ జీవనంతో పొంగల్ ది పెనవేసుకున్న బంధం అని నరేంద్ర మోదీ అన్నారు. న్నారు. నేల ఆరోగ్యం, సామర్థ్యాన్ని కాపాడాలని, నీటిని సంరక్షించాలని, ప్రకృతి వనరులను తెలివిగా వాడుకోవాలని ఈ పండుగ మనకు చెబుతుందని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్  నాయుడు తదితరులు పాల్గొన్నారు.