అబద్ధాలరావు.. డ్రామాలు ఆపు.. హరీశ్‌‌రావుపై మంత్రి పొంగులేటి ఫైర్

 అబద్ధాలరావు.. డ్రామాలు ఆపు.. హరీశ్‌‌రావుపై మంత్రి పొంగులేటి ఫైర్
  • నాదర్‌‌‌‌గుల్‌‌ భూముల్లో మీ హయాంలో అక్రమాలు జరిగితే.. నాపై నిందలేస్తరా?
  • హరీశ్​, కేటీఆర్..​ నా త‌‌ప్పుల‌‌ను నిరూపిస్తే  ముక్కు నేల‌‌కు రాస్తా
  • ఆ 3 సంస్థలకు రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు అధికారంలో ఎవరున్నారు?
  • సర్వే నంబర్ 613లో మ్యుటేషన్ల ప్రక్రియ ఎవరు పూర్తి చేశారు?
  • రోడ్లు, షీట్లు వేసి భూమిని కబ్జా చేసిందెవరు? 
  • మీ అవినీతి బుర‌‌ద‌‌ను మాకు అంటించాల‌‌ని చూస్తున్నారా?
  • వట్టినాగులపల్లి వివాదం ‘కుటుంబ పంచాయితీ’.. ప్రభుత్వానికి ఏం సంబంధమని మండిపాటు

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల కాలంలో  జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురద జల్లుతూ దిగజారుడు రాజకీయాలకు  పాల్పడుతున్నారని బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి మండిపడ్డారు.  ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక ప్రతిపక్ష నేతలు నిత్యం అబద్ధాలను వల్లె వేస్తున్నారని విమర్శించారు.  హరీశ్‌‌రావు అబద్ధాలరావు, కేటీఆర్‌‌  డ్రామారావు అని,  వారి చిల్లర రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

ఇకనైనా ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని, లేదంటే కాలగర్భంలో కలిసిపోతాయని అన్నారు. బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.  పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాలరావు, డ్రామారావు, శకుని (కేసీఆర్) మామలు.. ఇప్పుడు ఆ బురదను ప్రజా ప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారని ఆరోపించారు.  నాదర్‌‌‌‌‌‌‌‌గుల్‌‌‌‌, వట్టినాగులపల్లి, కొత్వాల్‌‌‌‌గూడ అంశాలపై మంత్రి ఆధారాలతో సహా ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు.  

నాదర్‌‌‌‌గుల్ భూములకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు.. గూగుల్ మ్యాప్స్‌‌‌‌తో  ఫెన్సింగ్​ ఎప్పుడు జరిగాయో చూపించారు.  సుప్రీంకోర్టులో ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌పీ అయితే.. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం కౌంటర్​ కూడా వేయలేదని, నిరుడు తమ ప్రభుత్వం దాఖలు చేసిందని తెలిపారు.  ప్రజా క్షేత్రంలో ఓడిపోయిన వారు ఇలాంటి చిల్లర ఆరోపణలతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. తాము ఏ విచారణకైనా సిద్ధమని, నిజాయితీగా భూములను కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 

గత పాలకుల నిర్వాకం వల్ల చేజారిపోతున్న భూములను తమ ప్రభుత్వం చట్టబద్ధంగా వెనక్కి తీసుకువస్తుందని స్పష్టం చేశారు. వట్టినాగులపల్లి భూ వివాదం పూర్తిగా ప్రైవేట్ పంచాయితీ అని, తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.  ‘‘నా త‌‌‌‌ప్పుల‌‌‌‌ను నిరూపిస్తే  ముక్కు నేల‌‌‌‌కు రాస్తా.. ఖబడ్దార్’’ అని వ్యాఖ్యానించారు. మైనింగ్, క్రషర్ల విషయంలో తాము కొత్తగా ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదన్నారు.  

బీఆర్ఎస్‌‌‌‌ హయాంలోనే అక్రమాలు..

నాదర్‌‌‌‌గుల్ గ్రామంలోని సర్వే నంబర్ 613లో ఉన్న 373 ఎకరాల 22  గుంటల భూమి వ్యవహారంపై మంత్రి పొంగులేటి  వివరణ ఇచ్చారు. ఇది వాస్తవానికి ప్రైవేట్ భూమిగా ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ భూమిగా రికార్డుల్లోకి రావడం వల్ల.. గత రెండు దశాబ్దాలుగా అనేక కోర్టు కేసుల్లో నలిగిందని గుర్తు చేశారు. 2004 నుంచి ఈ భూమి చుట్టూ అనేక వివాదాలు అల్లుకున్నాయని, ఎన్నో ప్రైవేట్ సంస్థలు దీనిపై కన్నేసి కోర్టుల మెట్లు ఎక్కాయని తెలిపారు. 

ఒక్కోసారి ప్రైవేట్ వ్యక్తులు గెలవడం, మరోసారి ప్రభుత్వం పైకోర్టుకు వెళ్లడంలాంటి పరిణామాల మధ్య ఈ భూమి పరిస్థితి అటూ ఇటూ ఊగిసలాడిందని వివరించారు . 2014 సెప్టెంబర్ 1న యునైటెడ్ ల్యాండ్ మార్క్స్, ఆల్ఫా ఎస్టేట్ హౌసింగ్, ఒమేగా డెవలప్‌‌‌‌మెంట్ వెంచర్స్‌‌‌‌లాంటి 3 సంస్థలకు రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు అధికారంలో ఎవరున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత 2016 అక్టోబర్ 24న అదే సర్వే నంబర్ 613లో మ్యూటేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారన్నారు. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, దానికి బాధ్యులు కూడా వారేనని స్పష్టం చేశారు.  2021 ఫిబ్రవరిలో తీసిన మ్యాపులో ఆ భూమి ఖాళీగా ఉండగా, 2021 డిసెంబర్ నాటికి అక్కడ ఫెన్సింగ్ పనులు మొదలయ్యాయని చూపించారు.

 2022 నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో రోడ్లు, షీట్లు వేసి భూమిని కబ్జా చేశారన్నారు. ఈ కాలమంతా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, వారి కండ్ల ముందే ఈ అక్రమాలన్నీ జరిగాయని విమర్శించారు. అప్పుడు అధికారంలో ఉండి ఆ పనులను ఆపకుండా మౌనం వహించిన నేతలు, ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు.  ఎవరో వ్యక్తులు భూమిని ఆక్రమిస్తుంటే అప్పుడు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.  న్యాయస్థానాల్లో నాదర్‌‌‌‌గుల్ భూముల కేసు నడుస్తున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. 

2022లో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలైనప్పుడు కనీసం కౌంటర్ అఫిడవిట్ కూడా వేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేశారని ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మార్చి 17న రెవెన్యూ శాఖ తరఫున  కౌంటర్ వేసిందని, అది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేసిందని తెలిపారు.  

రాఘవ కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌పై దుష్ర్పచారం

మైనింగ్ , క్రషర్ల విషయంలో మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. రాఘవ కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌కు వ్యతిరే కంగా చేస్తున్న ప్రచారం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కొత్వాల్ గూడలోని క్రషర్ గత 20 ఏండ్లుగా కొనసాగు తున్నదని, దీనికి కొత్తగా తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ ఏర్పాటు కాకముందు నుంచే తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ అక్కడ కార్యకలా పాలు సాగిస్తున్నదని డాక్యుమెంట్లు చూపారు. బుద్వేల్ ల్యాండ్ యాక్షన్ సందర్భంగా రాక్ బ్లాస్టింగ్ వల్ల వచ్చిన మెటీరియల్‌‌‌‌ను క్రష్ చేయడం తప్ప, అక్కడ కొత్తగా క్వారీలేమీ లేవని వివరించారు. 

బీఆర్ఎస్ నేతలు ఆర్టీఐ ద్వారా తప్పుడు సమాచారాన్ని సేకరించి, దాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. క్రషర్ల మూసివేతపై కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని, చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు.

వట్టినాగులపల్లి భూ వివాదం షా కుటుంబానిది.. 

వట్టినాగులపల్లి భూ వివాదం పూర్తిగా షా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత, వారసత్వ సమస్య అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. 60–-70 ఏండ్ల నాటి భూముల వ్యవహారాన్ని తీసుకువచ్చి, తన కుటుంబ సభ్యులకు ఆపాదిం చడం బీఆర్ఎస్ నేతల నీచ రాజకీయాలకు పరాకాష్ట అని ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. ఆ కంపె నీల్లో తన భార్య కానీ, తన కొడుకు కానీ భాగస్వాములుగా ఉన్నట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు.

 ఒక ప్రైవేట్ కంపెనీ డెవలప్‌‌‌‌మెంట్ కోసం తీసుకు న్న భూమిని తన కుటుంబానికి అంటగట్టడం వారి అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు.  ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొద్ది రోజుల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం నాలా కన్వర్షన్లు ఎలా చేసిందో ఫైల్ నంబర్లతో సహా వెల్లడించారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వంపై నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, తమ నిజాయితీని ఎవరూ ప్రశ్నించలేరన్నారు.