స్కీమ్​లను జనాల్లోకి తీసుకెళ్లండి: పొంగులేటి

స్కీమ్​లను జనాల్లోకి తీసుకెళ్లండి: పొంగులేటి
  • సోషల్ మీడియా వింగ్​ను విస్తృతంగా వాడుకోవాలి: పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి
  • రెవెన్యూ, ఐ అండ్ పీఆర్ మంత్రిగా బాధ్యతలు స్వీకరణ 

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో ఐ అండ్ పీఆర్​ విభాగం కీలక పాత్ర వహించాలని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలలో అవేర్​నెస్​ పెంచేందుకు సంప్రదాయ ప్రసారమాధ్యమాలతోపాటు సోషల్ మీడియా వింగ్ ను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. తెలంగాణ మాస పత్రికను మరింత ప్రామాణికంగా తీర్చి దిద్దడంతోపాటు ఈ పత్రికను రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, ప్రజా ప్రతినిధులకు, సామాన్య ప్రజానీకానికి అందుబాటులో తేవాలన్నారు. ప్రింట్ మీడియా, అవుట్ డోర్ విభాగం చేపట్టిన కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. జర్నలిస్టుల సంక్షేమం, క్షేత్ర స్థాయిలో ప్రచార నిర్వహణపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సమాచార శాఖ పనితీరును మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. 

ఉదయమే బాధ్యతల స్వీకరణ

సెక్రటేరియెట్లో గురువారం ఉదయం రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలు నాయక్, ఆది శ్రీనివాస్, యశస్వినీ రెడ్డి తోపాటు రేణుకా చౌదరి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కె.అశోక్ రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జేడీ లు జగన్, శ్రీనివాస్, వెంకట రమణ, డీడీ లు మధు సూధన్, హాష్మి, రాజా రెడ్డి, సీఐఈ  రాధా కిషన్ తదితరులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.

భువనగిరిలో స్పోర్ట్స్  కాంప్లెక్స్ కు 10 ఎకరాల భూమి

భువనగిరి జిల్లా రాయగిరి లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పది ఎకరాల భూమిని కేటాయిస్తూ తన మొదటి ఫైల్​పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సంతకం చేశారు. రూ. 9.50 కోట్ల విలువ గల ఈ పదెకరాల స్థలాన్ని మల్టి పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం యువజన, క్రీడల శాఖకు కేటాయించారు.

33 జిల్లాల డీపీఆర్ఓలకు మోడర్న్ కెమెరాలు

రాష్ట్రంలోని 33 జిల్లాల డీపీఆర్ఓ లకు అధునాతన కెమెరాలు అందజేసే ఫైల్ పై మంత్రి పొంగులేటి సంతకం చేశారు. అలాగే గృహ నిర్మాణ శాఖకు చెందిన పలు పరిపాలనా సంబంధిత ఫైళ్లపై సంతకం చేశారు.