- ఖమ్మం మాజీ ఎంపీపై ఒత్తిడి పెంచుతున్న అనుచరులు
- ఇంకా డైలమాలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- కర్నాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్తారని టాక్
- ఇటీవలే బీజేపీ నేతలో రెండో సారి భేటీ
రాజకీయ భవితవ్యంపై డైలమాలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఆయన అనుచరులు ఒత్తిడి పెంచుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోని పక్షంలో తమ దారి తాము చూసుకుంటామంటూ తెగేసి చెబుతున్నట్టు తెలుస్తోంది. పొంగులేటి ప్రధాన అనుచరుల్లో ఒకరైన మట్టా దయానంద్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మట్టా దయానంద్ ను ఇదివరకే సత్తుపల్లి అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాత కొత్తగూడెంలో పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీర్ గా పనిచేస్తున్న సుధాకర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత పొంగులేటి తన వైఖరిని మార్చుకొన్నారు. తమ పార్టీ సత్తుపల్లి అభ్యర్థిగా సుధాకర్ బరిలోకి దిగుతారని ప్రకటించారు. ఈ పరిణామంతోనే మట్టా దయానంద్ కాంగ్రెస్ లో చేరారా..? లేక పొంగులేటి ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే ఫ్రస్ట్రేషన్ లో పార్టీ మారారా..? అన్న చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి హామీతోనే దయానంద్ కాంగ్రెస్ లో చేరినట్టు తెలుస్తోంది. సత్తుపల్లి టికెట్ ఇప్పిస్తానని ఆమె ప్రామిస్ చేశారని తెలిసింది.
నిర్ణయం ఎపుడు
పొంగులేటి గత కొన్ని నెలలుగా ఏ పార్టీ లో చేరాలి అన్న విషయం లో డైలమాలో ఉన్నారు. బీజేపీ లో చేరాలని ఆ పార్టీ నేతలు ఇటీవల ఖమ్మం వెళ్లి ఆయన తో చర్చలు జరిపారు. కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత నిర్ణయం వెల్లడిస్తానని వారితో పొంగులేటి చెప్పినట్టు ప్రచారం జరిగింది. కర్ణాటక ఫలితాలు వచ్చి 13 రోజుల అవుతున్నా పొంగులేటి నిర్ణయం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా నిన్న హైదరాబాద్ శివారులోని ఓ ఫాంహౌస్ లో పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లితో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ భేటీ అయినట్టు తెలిసింది. ఐదారు గంటల పాటు వీరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే పొంగులేటి ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం.
11 టిక్కెట్లు కావాలె
పొంగులేటి ఏ పార్టీ లో చేరిన ఉమ్మడి ఖమ్మం లో 10 సీట్ల తో పాటు సిటీ లోని కంటోన్మెంట్ టికెట్ కూడా అడుగుతున్నారు. ఇక్కడి నుంచి తన అనుచరుడు, ఓయూ ఉద్యమ కారుడు పిడమర్తి రవి టికెట్ ఆశిస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. నియోజకవర్గంలో ‘జై పొంగులేటి జై పిడమర్తి ’అని పెద్ద ఎత్తున వాల్ రైటింగ్స్ కూడా చేయించారు. ఇక మిగతా నియోజకవర్గ ల్లో తన అనుచరులు పోటీ చేయనున్నారు.
కాంగ్రెస్ లో ముగ్గురు
సత్తుపల్లి (ఎస్సీ) అసెంబ్లీ స్థానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కాంగ్రెస్ లో ఇప్పటికే ఇద్దరు పోటీ పడుతుండగా.. దయానంద్ చేరికతో ఆ సంఖ్య కాస్తా మూడుకు చేరింది. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత సంబాని చంద్రశేఖర్ రేస్ లో ఉన్నారు. ఆయన 2009, 2014 లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. అదే సీటు నుండి ఓయూ ఉద్యమ కారుడు రేవంత్ అనుచరుడు మానవతా రాయ్ టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా మట్ట దాయనంద్ చేరారు. ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
