కొత్త అవతారాల్లో వచ్చినా ప్రజలు నమ్మరు : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కొత్త అవతారాల్లో వచ్చినా ప్రజలు నమ్మరు : మంత్రి పొంగులేటి  శ్రీనివాస రెడ్డి
  •     బీఆర్​ఎస్​పై పొంగులేటి విమర్శ

ఖమ్మం రూరల్, వెలుగు: పదేళ్ల అధికార దాహంలో పేదవాడిని విస్మరించి, నాడు రైతుల చేతులకు సంకెళ్లు వేసిన వారు నేడు రంగురంగుల అవతారాలతో వస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' క్లస్టర్-1 సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని మండిపడ్డారు. ప్రజా దీవెనలు ఉన్నంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. 

కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, చైర్​పర్సన్ పోకబత్తిని అనిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం కార్పొరేషన్​ 1, 59, 60 డివిజన్ల ప్రజాదర్బార్​ను రామన్నపేట జడ్పీ హైస్కూల్​ ఆవరణలో నిర్వహించగా, మంత్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఇతర ఆఫీసర్లతో కలిసి పాల్గొని అర్జీలను స్వీకరించారు.  

వనజీవి రామయ్య స్మారక వనానికి శంకుస్థాపన..

పర్యావరణ పరిరక్షణే శ్వాసగా, కోటి మొక్కలే ప్రాణంగా జీవించిన పద్మశ్రీ వనజీవి రామయ్య జ్ఞాపకార్థం వచ్చే జూన్ లో స్మారక వనానికి అంకురార్పణ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ సత్యనారాయణపురం క్లస్టర్ పరిధిలో నిర్వహించిన 'ప్రజాదర్బార్'లో ఆయన పాల్గొన్నారు. రామయ్య సతీమణి జానమ్మ మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోగా ఆయన సానుకూలంగా స్పందించారు. 

రామయ్య సేవలను స్మరించుకుంటూ జూన్‌‌‌‌లో స్మారక చిహ్నానికి శంకుస్థాపన చేస్తామని, జానమ్మకు ప్రభుత్వ పింఛను అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. స్మారకం కోసం తక్షణమే స్థలాన్ని సేకరించాలని కలెక్టర్‌‌ను ఆదేశించారు.