అనుచరులతో నేడు పొంగులేటి మీటింగ్​

అనుచరులతో నేడు పొంగులేటి మీటింగ్​
  • ఖమ్మంలో  భేటీ కానున్న మాజీ ఎంపీ 
  • చేరబోయే పార్టీపై క్లారిటీ ఇస్తారనే అంచనా 

ఖమ్మం, వెలుగు: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తన రాజకీయ భవిష్యత్​ పై నేడు క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల నుంచి ఏ పార్టీ లోకి వెళ్లేది చెప్పకుండా సాగదీస్తున్న ఆయన, ఎట్టకేలకు తన అనుచరులు, అభిమానులకు శుక్రవారం స్పష్టత ఇస్తారని సమాచారం. జిల్లాలోని అనుచరులతో శుక్రవారం ఖమ్మంలో పొంగులేటి మీటింగ్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 30 నుంచి 50 మంది వరకు ఈ సమావేశానికి  రావాలని ఫోన్​ ద్వారా సమాచారం అందించారు. 

ఉదయం ఏడున్నర గంటలకు ఎస్​ఆర్​ కన్వెన్షన్​ లో జరిగే ఈ సమావేశంతో తన ఆలోచనను కార్యకర్తలతో పంచుకుంటారన్న చర్చ నడుస్తోంది. బీజేపీ అంటూ, కాంగ్రెస్​ అంటూ ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న ప్రచారానికి ఆయన ముగింపు ఇస్తారని తెలుస్తోంది. అయితే, ఇప్పటికే చేరబోయే పార్టీపై ఓ అంచనాకు వచ్చిన పొంగులేటి, తన నిర్ణయాన్ని అనుచరులకు చెప్పి, ఓకే చేయించుకునేందుకే నేతలు, ముఖ్య కార్యకర్తలను పిలిచారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. శుక్రవారం  సమావేశం తర్వాత మూడు నాలుగు రోజుల్లో ఏ పార్టీలో చేరబోయేది అధికారికంగా మీడియాకు ప్రకటిస్తారని అంటున్నారు. పొంగులేటి, జూపల్లి టీమ్​ కు రాష్ట్రంలో 16 నుంచి 18 సీట్లు కేటాయించేందుకు ఓ జాతీయ పార్టీ అంగీకరించిందని,  వీళ్లిద్దరితో పాటు మరికొందరు నేతలు టీమ్​ గా ఏర్పడి త్వరలో ఆ పార్టీలో చేరబోతున్నారని చెప్తున్నారు. కాగా,  ఆ పార్టీ ఏమిటనేది శుక్రవారం మీటింగులో క్లారిటీ వస్తుందని అభిప్రాయపడుతున్నారు.