
జగిత్యాల జిల్లా: ‘‘150 కొట్టు-దసరాకు పొట్టేలు పట్టు’’. జగిత్యాల సారంగాపూర్లో దసరా పండుగ సందర్భంగా కనిపించిన ఫ్లెక్లీ ఇది. పండుగ వచ్చిందంటే చాలు గల్లీలో ఉన్న చిన్న దుకాణం నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఆఫర్లు, డిస్కౌంట్స్ అంటూ ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తాయి. అందులోనూ దసరా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇక తెలంగాణలో అయితే దసరా పండుగ అంటే చుక్క ముక్క ఆ కిక్కే వేరు అన్నట్లుగా సెలబ్రేషన్స్ ఉంటాయి. జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలో సాయిని తిరుపతి అనే వ్యక్తి పండగకు పది రోజుల ముందే వెరైటీ ఆఫర్ను ప్రకటించాడు.
‘‘150 కొట్టు-పండగకు పొట్టేలును పట్టు’’ అన్నట్టుగా దసరా ఆఫర్ పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. 150 రూపాయల టోకెన్ కొనుగోలు చేసిన వారికి దసరా రోజు తీసే లక్కీ డ్రాలో 5 బంపర్ బొనాంజా బహుమతులను ప్రకటించాడు. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా పొట్టేలు, రెండవ బహుమతి చిల్డ్ బీర్ కేస్, మూడవ బహుమతిగా ఫుల్ బాటిల్ విస్కీ, నాలుగో బహుమతిగా నాటుకోడి పుంజు, ఐదో బహుమతిగా చీర ఇస్తున్నట్లు తెలుపుతూ ప్లెక్సీ ఏర్పాటు చేశాడు. అక్టోబర్ 1న డ్రా తీస్తామని.. ఇదంతా కేవలం పండగ హంగామా ఎంజాయ్ చేసేందుకు గ్రామంలో ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే అని తిరుపతి చెప్పుకొచ్చాడు.