ఆధ్యాత్మికం : శరీరం.. శవం.. బుద్ధుడి సందేశం..!

ఆధ్యాత్మికం : శరీరం.. శవం.. బుద్ధుడి సందేశం..!

రాజగృహంలో ఒకప్పుడు లోకోత్తర సౌందర్యవతి అయిన సిరిమ అనే యువతి ఉండేది. ఆమె రాజనర్తకి! ఆమె తరచూ భిక్షుసంఘానికి అతిథి సత్కారాలు కూడా చేసేది. ఒకసారి ఆమె భిక్షువులకు విందు ఇచ్చింది.' ఆమె ఎంత సౌందర్యవతి! భిక్షువులకు ఎంత బాగా ఆతిథ్యం ఇచ్చింది. ఆమె వడ్డించిన ఆహారపదార్థాలు ఎంత రుచిగా ఉన్నవి' అనే విషయాల్ని విహారానికి వెళ్లిన తర్వాత ఒక భిక్షువుకి, ఇంకో భిక్షువు చెప్పాడు. ఆ మాటలు విన్న భిక్షువు ఆమెను చూడకుండానే ఆమె పట్ల మోహాంధుడైనాడు!

ఏ విధంగానైనా ఆమెను పొందగలిగితే ఎంత బాగుండును అని కోరికకు బానిసైనాడు. ఏదో విధంగా ఆమెను చూడాలనుకున్నాడు. తర్వాత ఒకరోజు అతనికి ఆ అవకాశం రానే వచ్చింది. పెద్దవాళ్లైన భిక్షువులతో కలిసి ఆ రోజు ఆమె ఉండే భవనానికి వెళ్లాడు. అయితే, ఆమెకు ఆ రోజు ఒంట్లో నలతగా ఉంది. నడవలేని స్థితిలో ఉంది. కానీ, భిక్షువులు వచ్చారని కబురు అందగానే... వాళ్ల మీద గౌరవంతో వాళ్లను చూడటానికి వచ్చింది. అయితే. తన పరిచారకులు ఆమెను మెత్తని మంచంపై మోసుకొని తీసుకొచ్చారు! అప్పుడే ఈ
యువభిక్షువు ఆమెను చూశాడు. 'ఏదో జబ్బు చేసి ఉన్నప్పుడే ఇంత అందంగా ఉందే' అని ఆమెను చూడగానే అతడు మతి మరింత గాల్లో తేలినట్టయింది. ఆమె మీద అతడికి కోరిక ఇంకా బలంగా మారిపోయింది.

ఆమె చనిపోయింది!

ఆ రోజు రాత్రే సిరిమ చనిపోయింది. బాగా పొద్దుపోయిన తర్వాత బింబిసార మహారాజు బుద్ధుడి దగ్గరకు వచ్చి సిరిమ ఖననం చేయకుండా.. మూడు రోజులు మరణ వార్తను చెప్తాడు. 'ఆమె శవాన్ని భద్రపరిచేలా చూడండి' అని బుద్ధుడు రాజుతో అంటాడు. నాలుగో రోజు శవాన్ని శ్మశానానికి తీసుకునిపోయారు. అప్పటికే ఆమె శరీరం వాచిపోయింది. చర్మమంతా వదులుగా మారి.. క్రిములు అటూ ఇటూ పాకుతున్నాయి. నాలుగో రోజు బుద్ధుడు కొంతమంది భిక్షువులను తీసుకొని శ్మశానానికి వెళ్లాడు. 

అట్లా ఆయన తనతో తీసుకుపోయిన భిక్షువుల్లో ఆమె పట్ల తీవ్రమైన కోరికను పెంచుకున్న యువభిక్షువు కూడా ఉన్నాడు. అతడికి పరమ సౌందర్యరాశి అయిన సిరిమ కుళ్లిన శవాన్ని చూడటానికి వెళుతున్న సంగతి తెలియదు. శ్మశానానికి వెళ్లిన తర్వాత సిరిమ శవాన్ని చూసి చాలా చాలా బాధపడ్డారు. ఆ యువ భిక్షుడు విషాదంలో మునిగిపోయాడు. ఆమె దహన కార్యక్రమానికి బింబిసారమహారాజు కూడా వచ్చాడు.

బుద్ధుడి సందేశం

శ్మశానంలోనే బుద్ధుడు అక్కడ చేరిన భిక్షువులు, ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన చేయమని బింబిసార మహారాజుతో అన్నాడు. బుద్ధుడు చెప్పినట్టుగానే ఇప్పుడు సిరిము ఒకరాత్రికి వెయ్యి నాణేలకే దొరుకుతుంది' అని ప్రకటించాడు. ఎవరూ వెయ్యి నాణేలిచ్చి ఆమెను పొందడానికి ముందుకు రాలేదు. సరికదా.. ఐదు వందలు, రెండువందలు, చివరికి ఉచితంగా పొందడానికి కూడా ఎవరూ రాలేదు. అప్పుడు బుద్ధుడు అక్కడున్న భిక్షువులకి ఇలా చెప్పాడు.. "ఈ సిరిము భోగభాగ్యాలతో, విలాస సౌందర్యంతో జీవించి ఉన్న రోజుల్లో మహాధనవంతులు, కోటీశ్వరులు, గొప్ప హోదాగల రాజోద్యోగులు ఈమెతో గడపాలని ఉవ్విళ్లూరేవారు. 

ఒక్క రాత్రికి వెయ్యి నాణేలు ఇవ్వడానికి కూడా వెనకాముందూ ఆడేవారు కాదు. కానీ, ఇప్పుడు ఏమీ చెల్లించకుండానే ఇంటికి తీసుకుపోవచ్చు అంటే మాత్రం ఎవరూ ముందుకు రారు! భిక్షువులారా! సిరిమను చూడండి. మానవ శరీరం దుస్థితి చివరికి ఇట్లానే పరిణమిస్తుంది. క్రమంగా దెబ్బతిని శిథిలమై మట్టిలో కలిసిపోతుంది. అది ఎంత సౌందర్య విలసిత శరీరమైనా సరే!"అంటాడు. అప్పుడు ఆ సమూహంలోనే ఉన్న యున భిక్షువు మానవశరీర పరిణామదశ బోధపడి.. ఆ తీవ్ర కామవాంచా విముక్తుడు అయినాడు.