
ఆస్ట్రేలియాపై టీమిండియా యంగ్ టీమ్ అదరగొట్టింది. కంగారులను చిత్తు చేస్తూ భారత అండర్-19 జట్టు సునాయాస విజయాన్ని అందుకుంది. ఆదివారం(సెప్టెంబర్ 21) జరిగిన తొలి అనధికారిక యూత్ వన్డేలో 7 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పాటు ఛేజింగ్ లో బ్యాటింగ్ త్రివేది (69 బంతుల్లో 61*), వికెట్ కీపర్ కుందు (74 బంతుల్లో 87*) హాఫ్ సెంచరీలు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అండర్-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఒక మాదిరి లక్ష్య చేధనతో బ్యాటింగ్ కు దిగిన ఇండియా 30.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసి గెలిచింది. ఇండియన్ టాప్ స్కోరర్ అభిజ్ఞాన్ కుందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఘోరమైన ఆరంభం లభించింది. తొలి ఓవర్ లో కిషన్ కుమార్ ధాటికి ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ తర్వాత వరుస విరామాల్లో ఆసీస్ జట్టు వికెట్లను కోల్పోతూనే వస్తుంది. జాన్ జేమ్స్ 68 బంతుల్లో 77* పరుగులతో అజేయంగా నిలిచాడు. స్టీవెన్ హోగన్ 39 పరుగులు చేసి ఆదుకునే ప్రయత్నం చేసినా తన ఇన్నింగ్స్ ను భారీ స్కోర్ గా మలచలేకేపోయాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో జాన్ జేమ్స్ 68 బంతుల్లో 77* పరుగులతో జట్టుకు డీసెంట్ టోటల్ అందించాడు. భారత బౌలింగ్ విభాగంలో హెనిల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా.. కిషన్ కుమార్, కనిష్క్ చౌహాన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
226 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియాకు కూడా మంచి ఆరంభం లభించింది. స్టార్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో ఏడు ఫోర్లు సిక్సర్‌తో 38 పరుగులు చేసి సూపర్ స్టార్ట్ అందించాడు. అయితే ఆ తర్వాత 25 పరుగుల వ్యవధిలో ఇండియా సూర్య వంశీతో పాటు మరో రెండు వికెట్లు కోల్పోయింది. 10 బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసి టీమిండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే ఔటయ్యాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన విహాన్ మల్హోత్రా (9) ను చార్లెస్ లాచ్‌మండ్ ఔట్ చేయడంతో 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అభిజ్ఞాన్ కుందు (87*), వేదాంత్ త్రివేది (61*) భారీ భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు.