కవ్విస్తే కుమ్మేశారు.. ఈసారి కసి తీరా.. పాక్‌‌ను మళ్లీ చిత్తు చేసిన ఇండియా

కవ్విస్తే కుమ్మేశారు.. ఈసారి కసి తీరా.. పాక్‌‌ను మళ్లీ చిత్తు చేసిన ఇండియా

దుబాయ్‌‌: టీమిండియా మళ్లీ జిగేల్‌‌. దాయాది పాకిస్తాన్ మరోసారి ఢమాల్. ఆసియా కప్‌‌లో వారం వ్యవధిలోనే రెండుసార్లు తలపడ్డ చిరకాల ప్రత్యర్థుల సమరంలో రెండోసారి కూడా ఇండియా పైచేయి సాధించింది. గ్రూప్ దశలో తేలిపోయిన పాక్‌‌ను ఇంకోసారి కసితీరా కొట్టేసింది. గత పోరులో తమకు హ్యాండ్‌‌షేక్ ఇవ్వలేదని రచ్చచేసిన పాకిస్తాన్‌‌ను.. అభిషేక్ శర్మ (39 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74) విధ్వంసకర బ్యాటింగ్‌‌తో షేక్ చేసేశాడు. అతనికి తోడు శుభ్‌‌మన్ గిల్ (28 బాల్స్‌‌లో 8 ఫోర్లతో 47) కూడా దంచడంతో ఆదివారం జరిగిన సూపర్‌‌‌‌–4 మ్యాచ్‌‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడిన పాక్ తొలుత 20 ఓవర్లలో 171/5 స్కోరు చేసింది.

ఓపెనర్ సాహిబ్జదా ఫర్హాన్ (45 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 58) ఫిఫ్టీతో సత్తా చాటగా..  సైమ్ ఆయుబ్ (21), మహ్మద్ నవాజ్ (21), ఫహీమ్ అష్రఫ్ (20 నాటౌట్‌‌) రాణించారు. ఇండియా బౌలర్లలో శివం దూబే  (2/33) రెండు వికెట్లతో మెప్పించగా..  హార్దిక్ పాండ్యా (1/29), కుల్దీప్ యాదవ్  (1/31) చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం  ఇండియా 18.5  ఓవర్లలో 174/4  స్కోరు చేసి ఈజీగా గెలిచింది. తిలక్ వర్మ (19 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 నాటౌట్‌‌) కూడా రాణించాడు. అభిషేక్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌‌తో ఇండియా  తలపడనుంది.

ఓపెనర్ల ధమాకా
టార్గెట్ ఛేజింగ్‌‌లో ఇండియా ఓపెనర్లు అభిషేక్‌‌ శర్మ, శుభ్‌‌మన్ గిల్‌‌ దుమ్మురేపారు. ఈ లెఫ్ట్–రైట్ బ్యాటర్లు పాక్ బౌలింగ్‌‌ను ఉతికేశారు. షాహీన్ షా బౌలింగ్‌‌లో ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌‌నే సిక్స్‌‌గా మలిచిన అభి తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. ఈ టోర్నీలో అంతగా ఆకట్టుకోలేకపోతున్న గిల్‌‌ కీలక సమయంలో ఫామ్‌‌లోకి వచ్చాడు. స్పిన్‌‌ బౌలింగ్‌‌లో తడబాటును వీడాడు. ఓ ఎండ్‌‌లో అభి భారీ షాట్లతో బాల్‌‌ను ఎక్కువ సేపు గాల్లోనే ఉంచుతూ  ఫోర్లు, సిక్సర్లు కొట్టగా.. గిల్ మంచి టైమింగ్, టెక్నిక్‌‌తో క్లాసిక్ గ్రౌండ్ షాట్లతో బౌండ్రీలు రాబట్టాడు. సైమ్‌‌, షాహీన్ ఓవర్లలో రెండేసి ఫోర్లతో ఆకట్టుకోగా.. స్పిన్నర్ అబ్రార్ బౌలింగ్‌‌లో అభి 4,6తో మరింత స్పీడు పెంచాడు. వీళ్ల జోరుకు పవర్ ప్లేలోనే ఇండియా 69 రన్స్ రాబట్టింది. ఫీల్డింగ్ మారిన తర్వాత  కూడా అభి–గిల్ జోరు తగ్గలేదు.  స్పిన్నర్ అబ్రార్‌‌‌‌ను టార్గెట్ చేసిన అభి ఏడో ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టాడు. ఓ బాల్‌‌ ఫఖర్ జమాన్ చేతుల్లో నుంచి లైన్ అవతల పడింది. సైమ్ బౌలింగ్‌‌లో ఫోర్‌‌‌‌తో 22 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.

తొమ్మిది ఓవర్లకే స్కోరు వంద దాటడంతో 15–16  ఓవర్లలోనే మ్యాచ్ ముగిసేలా కనిపించింది. కానీ, పదో ఓవర్లో బౌలింగ్‌‌కు వచ్చిన ఫహీమ్ అష్రఫ్‌‌ గిల్‌‌ను బౌల్డ్ చేసి 105 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ బ్రేక్ చేయగా.. రవూఫ్‌‌ వేసిన తర్వాతి ఓవర్లో  కెప్టెన్ సూర్య కుమార్ (0) స్కూప్ షాట్‌‌కు ట్రై చేసి అబ్రార్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. వరుసగా రెండు వికెట్లు పడ్డా వెనక్కుతగ్గని అభి.. ఫహీమ్‌‌ బౌలింగ్‌‌లో రెండు ఫోర్లతో మళ్లీ జోరు పెంచాడు. ఆపై అబ్రార్ ఓవర్లో భారీ సిక్స్‌‌తో స్టేడియాన్ని హోరెత్తించిన అతను మరో షాట్‌‌కు ట్రై చేసి ఔటయ్యాడు. కానీ, అప్పటికే మ్యాచ్‌‌ ఇండియా చేతుల్లోకి వచ్చేసింది. కొత్తగా క్రీజులోకి వచ్చిన తిలక్‌‌ వర్మ, శాంసన్‌‌ (13)  జాగ్రత్తగా ఆడటంతో రన్‌‌రేట్ తగ్గిపోయింది. 17వ ఓవర్లో శాంసన్‌‌ను బౌల్డ్ చేసిన రవూఫ్‌‌ పాక్ శిబిరంలో ఆశలు రేపాడు. కానీ, వచ్చీరాగానే హార్దిక్ (7 నాటౌట్‌‌) ఫోర్ కొట్టగా..  తిలక్  రెండు భారీ సిక్సర్లు, ఫోర్‌‌‌‌తో గెలుపు లాంఛనం పూర్తి చేశాడు. 

ఫర్హాన్‌‌ ధనాధన్‌‌.. దూబే దెబ్బ
తొలుత టీమిండియా ఫీల్డింగ్ తప్పిదాలను సొమ్ము చేసుకుంటూ పాక్ మంచి స్కోరు చేసింది.  హార్దిక్ పాండ్యా బౌలింగ్‌‌లో ఇన్నింగ్స్‌‌ రెండో బాల్‌‌కే ఓపెనర్‌‌‌‌ సాహిబ్జదా ఫర్హాన్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను అభిషేక్ శర్మ డ్రాప్ చేశాడు. అప్పటికి ఖాతానే తెరవని ఫర్హాన్ ఈ చాన్స్‌‌ను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. మరో ఓపెనర్ ఫఖర్ జమాన్ (15).. రెండో ఓవర్లో బుమ్రాకు రెండు ఫోర్లతో వెల్‌‌కం చెప్పాడు. 

హార్దిక్ బౌలింగ్‌‌లోనూ ఓ ఫోర్ కొట్టిన అతను తర్వాతి బాల్‌‌కే కీపర్‌‌‌‌ శాంసన్ పట్టిన  లో క్యాచ్‌‌కు వెనుదిరగడంతో ఇండియాకు ఫస్ట్ బ్రేక్ లభించింది. గత మూడు మ్యాచ్‌‌ల్లో ఓపెనర్‌‌‌‌గా డకౌట్ అయిన సైమ్ ఆయుబ్ ఈ సారి ఎదుర్కొన్న రెండో బాల్‌‌కే ఫోర్ రాబట్టాడు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో ఫర్హాన్ రెండు ఫోర్లతో జోరందుకున్నాడు. దాంతో కెప్టెన్ సూర్య.. స్పిన్నర్‌‌‌‌ వరుణ్ చక్రవర్తిని బరిలోకి దించాడు.

అతని నాలుగో బాల్‌‌కే సైమ్‌‌ ఆయుబ్ స్వీప్ షాట్‌‌కు ట్రై చేసి ఇచ్చిన సింపుల్‌‌ క్యాచ్‌‌ను షార్ట్‌‌ ఫైన్‌‌ లెగ్‌‌లో కుల్దీప్ డ్రాప్ చేశాడు.  మరోవైపు బుమ్రాను టార్గెట్‌‌ చేసి ఇంకో రెండు ఫోర్లు కొట్టిన ఫర్హాన్‌‌ పవర్‌‌‌‌ ప్లేను 55/1తో ముగించాడు. ఫీల్డింగ్ మారిన తర్వాత ఇండియా స్పిన్నర్లపై ఫర్హాన్‌‌, సైమ్ ఎదురుదాడికి  భారీ సిక్సర్లు కొట్టారు.  అక్షర్ బౌలింగ్‌‌లో  సిక్స్‌‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఫర్హాన్‌‌ బ్యాట్‌‌తో గన్ కాలుస్తున్నట్టుగా సెలబ్రేట్ చేసుకున్నాడు. సగం ఓవర్లకు పాక్ 91/1తో పటిష్ట స్థితిలో నిలిచి భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఈ దశలో ఇండియా బౌలర్లు పుంజుకొని రన్స్‌‌ కట్టడి చేయడంతో పాటు వరుసగా వికెట్లు పడగొట్టారు.

థర్డ్ పేసర్‌‌‌‌గా 11వ ఓవర్లో బౌలింగ్‌‌కు వచ్చిన ఆల్‌‌రౌండర్ శివం దూబే అద్భుత బౌలింగ్‌‌తో అదరగొట్టాడు.  తన మూడో బాల్‌‌కే  అభిషేక్ పట్టిన చురుకైన క్యాచ్‌‌తో సైమ్‌‌ను ఔట్‌‌ చేశాడు.దాంతో రెండో వికెట్‌‌కు 72 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ ముగిసింది.  హుస్సేన్ తాలత్‌‌ (10)ను కుల్దీప్‌‌ పెవిలియన్ చేర్చగా.. ఫర్హాన్‌‌ను కూడా దూబే వెనక్కుపంపాడు.

వరుసగా ఆరు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో 16 ఓవర్లకు పాక్ 121/4తో నిలిచి 150 చేయడం కూడా కష్టమే అనిపించింది. కానీ, కుల్దీప్ వేసిన తర్వాతి  ఓవర్లో భారీ సిక్స్‌‌తో కెప్టెన్ సల్మాన్ ఆగా (17 నాటౌట్‌‌) ఇన్నింగ్స్‌‌లో చలనం తీసుకొచ్చాడు. దూబే ఆఖరి ఓవర్లో మహ్మద్ నవాజ్ 6,4 సహా 17 రన్స్ రావడంతో  పాక్ మళ్లీ పుంజుకుంది. బుమ్రా వేసిన 19వ ఓవర్లో నవాజ్‌‌ రనౌటైనా.. క్రీజులోకి వచ్చిన ఫహీమ్ సిక్స్‌‌ కొట్టి స్కోరు 150 దాటించాడు. తర్వాతి బాల్‌‌కే అతనిచ్చిన క్యాచ్‌‌ను గిల్‌‌ డ్రాప్ చేశాడు. పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో ఫహీమ్ 4, 6 బాది స్కోరు 170 మార్కు దాటించాడు.

సంక్షిప్త స్కోర్లు

  • పాకిస్తాన్‌‌: 20 ఓవర్లలో 171/5 (ఫర్హాన్ 58,  సైమ్ 21,  దూబే 2/33)
  • ఇండియా: 18.5 ఓవర్లలో 174/4   (అభిషేక్ 74, గిల్ 47, రవూఫ్ 2/26)

కవ్విస్తే కుమ్మేశారు
ఈ మ్యాచ్‌‌లో పాక్ బౌలర్లు ఇండియా ఓపెనర్లను కవ్వించి చేతులు కాల్చుకున్నారు. షాహీన్‌ స్టార్టింగ్‌‌లోనే గిల్ కండ్లలోకి చూస్తూ రెచ్చిగొట్టే ప్రయత్నం చేశాడు. అతడిని పట్టించుకోని గిల్ తన దూకుడు కొనసాగించాడు. ఐదో ఓవర్లో రవూఫ్‌‌.. నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌‌లో ఉన్న అభితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో అంపైర్లు కలుగజేసుకొని విడదీశారు. ఈ ఘటన తర్వాత అభిషేక్ మరింత రెచ్చిపోయి ఆడి మ్యాచ్‌‌ను వన్‌‌సైడ్ చేసేశాడు.