ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి 'బాహుబలి 2' ఔట్.. ఎందుకిలా అంటే?

ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి 'బాహుబలి 2' ఔట్.. ఎందుకిలా అంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ , దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ వచ్చి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన చిత్రం ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’.  ఇప్పుడు ఈ మూవీని నెటిఫ్లిక్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించనున్నారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో అత్యంత ఘన విజయం సాధించిన ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్. సెప్టెంబర్ 30, 2025 నాటికి ఈ సినిమా హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ నుంచి పూర్తిగా తొలగించనున్నట్లు స్ట్రీమింగ్ దిగ్గజం అధికారికంగా ప్రకటించింది..

ముగిసిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు

బాహుబలి చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్, నెట్‌ఫ్లిక్స్ మధ్య ఉన్న డిజిటల్ స్ట్రీమింగ్ ఒప్పందం గడువు ముగియడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. తదుపరి ఒప్పందం కుదిరేంత వరకు ఈ సినిమా OTT ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండదు. ఓటీటీ  స్ట్రీమింగ్ హక్కులు పరిమిత కాల లైసెన్సింగ్ ఒప్పందాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే సినిమాలు తరచుగా ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరొక ప్లాట్‌ఫామ్‌కు మారుతుంటాయని స్పష్టమవుతుంది సినీ వర్గాలు తెలిపాయి. 

 బాక్సాఫీస్ వద్ద 'బాహుబలి 2 'రికార్డులు

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'బాహుబలి 2' 2017లో విడుదలైంది.  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. భారతీయ చలన చిత్ర రంగంలో విజువల్ స్టోరీటెల్లింగ్‌కు కొత్త ప్రమాణానికి నాంది పలికింది. రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపింది. అయితే ఇంటి వద్దే కూర్చుని ఎపిక్ యుద్ధ సన్నివేశాలను, ఎమోషనల్ కథాంశాన్ని మళ్లీ మళ్లీ చూసే అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ చిత్రం తొలగిపోవడం నిరాశను మిగిల్చింది.

'బాహుబలి: ది ఎపిక్' రెడీ
నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు ‘బాహుబలి 2’ను వీక్షించడానికి సెప్టెంబర్ 30 చివరి అవకాశం ఉంది. అయితే అభిమానులు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇది 'బాహుబలి: ది బిగినింగ్' , 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' చిత్రాల రెండు భాగాలను కలిపి, తిరిగి ఎడిట్ చేశారు. దీనిని మరింత మెరుగుపరిచిన వెర్షన్ లో విడుదల చేసేందుకు రాజమౌళి సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31, 2025న థియేటర్లలో మళ్లీ విడుదల చేయనున్నారు.