న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీది పదవుల ప్రయాణం కాదని, అది ప్రజా సేవా ప్రస్థానమని బీజేపీ జాతీయ కో-ఇన్చార్జ్ (తమిళనాడు, కర్నాటక) పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ అందించిన 25 ఏండ్ల పాలనలో సేవ, సుపరిపాలన, అభివృద్ధి, అంత్యోదయ మూలస్తంభాలుగా నిలిచాయని కొనియాడారు.
ప్రధాని మోదీ 25 ఏండ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో పార్టీ సంస్థాగత మీటింగ్ జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో ఈ ‘సేవా సంకల్ప్’ స్ఫూర్తిని దేశంలోని ప్రతి ప్రాంతానికి, అన్ని వర్గాల ప్రజలకు చేరవేసే ప్రణాళికపై విస్తృతంగా చర్చించినట్టు ఆయన వెల్లడించారు.
