
ఢిల్లీ : రాజ్యాంగానికి కట్టుబడి తెలంగాణ గవర్నర్ పని చేస్తున్నారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ నేతలు ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. కేసీఆర్ రాజ్యాంగానికి లోబడి వామపక్షాలు పని చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులిస్తే, ఎప్పుడు విచారణ చెయ్యాలనే టైమ్ ను వామపక్షాలు ఎలా డిసైడ్ చేస్తాయని మండిపడ్డారు. ‘‘ సీపీఐ, సీపీఎం నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు ఉనికి కోల్పోయారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, కేసీఆర్ కు హ్యాండీ కాపీగా కామ్రేడ్లు మారారు’’ అని పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఇవాళ, రేపు జరగనున్న బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాల్లో పార్టీ బలోపేతంపై ప్రధాన చర్చ జరుగుతుందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశలు వేదికగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు.