రాష్ట్ర ఖజానా కల్వకుంట్ల కుటుంబం పాలు: పొన్నాల

రాష్ట్ర ఖజానా కల్వకుంట్ల కుటుంబం పాలు: పొన్నాల

కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోతోందన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే గురించి ఆయన మాట్లాడుతూ.. గోదారి వరదలను కేసీఆర్ హెలికాఫ్టర్ లో వెళ్లి పరిశీలించారన్నారు. వర్షాలు వచ్చే ముందు ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేసి, ఆ నీళ్లను సముద్రం పాలు చేశారన్నారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు మధ్య 6,7,8 ప్యాకేజీలు పూర్తి చేసి ఉంటే ఆయకట్టుకు నీరు వచ్చేదని, ఆ పనులను ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. ఆ పనులు పూర్తి చేయకుండా కిందున్న సుందిళ్ళ, అన్నారం, మేడారం బ్యారేజి పనులకు 50 వేల కోట్ల ఖర్చుపెట్టారని పొన్నాల విమర్శించారు. మిడ్ మానేరులోకి నీళ్లు వస్తే తప్పా రైతులకు ఉపయోగం ఉండదన్నారు.

కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోతున్నారని, దీనివల్ల నదీ జలాలు సముద్రం పాలు అవుతున్నాయన్నారు. 50 వేల కోట్లు ఖర్చు  చేసినా.. కాళేశ్వరం నుంచి ఒక్క ఎకరాకు కూడా నీరు పారలేదన్నారు. తెలంగాణ ప్రజాధనం గోదావరి పాలు చేస్తున్నారని, ప్రణాళిక లేకుండా తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు పొన్నాల.డెబ్భైయి వేల పుస్తకాలు చదివిన పరిజ్ఞానం, ఎకరానికి కోటి రూపాయల సంపాదన అనుభవం తెలంగాణ ప్రజల పాలిట శాశ్వతంగా శాపంగా మారిందని ఆయన అన్నారు.

రాష్ట్ర ఖజానా కల్వకుంట్ల కుటుంబం పాలు అవుతోందని, కావాలంటే ఈ విషయంపై చర్చకు సిద్ధమన్నారు పొన్నాల లక్ష్మయ్య. చర్చకు రమ్మని కేసీఆర్ కు సవాల్ విసురుతున్నానని.. సీబీఐ విచారణకు కేసీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. కేసుల కోసం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను మోడీ వద్ద తాకట్టు పెట్టారని ఆయన అన్నారు.