
- ఇదే విషయాన్ని మేం ముందు చెప్తే రాజకీయం అన్నరు
- కవిత లెటర్‌పై బీఆర్ఎస్, బీజేపీ సమాధానమివ్వాలి
- కేసీఆర్ సూచన మేరకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి
- పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్‌ను సరెండర్ చేశారు
- కవిత లేఖ డైవర్షన్ కే సీఎంపై కేటీఆర్ ఆరోపణలని ఫైర్
కరీంనగర్/భీమదేవరపల్లి, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని తాము ముందు నుంచీ చెప్తున్నామని, ఇప్పుడు బీఆర్ఎస్ చీఫ్కేసీఆర్ కు ఆయన బిడ్డ కవిత లేఖతో ఇదే విషయం బయటపడ్డదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆ రెండు పార్టీల నేతలు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలాగా వ్యవహరిస్తున్నారని, దీనికి కవిత రాసిన లేఖనే రుజువన్నారు. గతంలో తెలంగాణ సగటు మనిషికి ఉన్న అనుమానానికి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలమిచ్చేలా, నిర్ధారణ అయ్యేలా ఆమె లేఖ ఉందన్నారు.
కరీంనగర్ లో శుక్రవారం విలేకరులతో మంత్రి పొన్నం మాట్లాడారు. లేఖలో కవిత ప్రస్తావించిన అంశాలపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ట్రబుల్ షూటర్ అని చెప్పే హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘సామాన్య కార్యకర్తలను కలవడం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. కార్యకర్తల కష్టాలు పంచుకోవడం లేదు. అంతపెద్ద సభలో 2001 నుంచి పార్టీ లో ఉన్న సీనియర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. బీజేపీపై సరైన విమర్శలు ఎందుకు చేయలేదు? అని కవిత నేరుగా పార్టీ అధ్యక్షుడిపైనే విమర్శలు చేశారు. దీనిపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు మాట్లాడడం లేదు?” అని పొన్నం ప్రశ్నించారు.
కేసీఆర్ సూచన మేరకే కిషన్ రెడ్డికి పదవి..
గతంలో పదేళ్లు కేంద్రంలో బీజేపీ తో బీఆర్ఎస్ ఎందుకు స్నేహంగా ఉందని, ప్రజావ్యతిరేక చట్టాలకు పార్లమెంట్ లో ఎందుకు మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్ ప్రశ్నిస్తే రాజకీయం అన్నారని మంత్రి పొన్నం గుర్తు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితే స్వయంగా అడుగుతున్నారని, ఆ ప్రశ్నలకు జవాబు చెప్పాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేతులెత్తేసి పార్టీని బీజేపీకి సరెండర్ చేశారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ ఒప్పందంలో భాగంగా కేసీఆర్ సూచన మేరకే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డికి ఇచ్చారని ఆరోపించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరిపించాలి
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లను బాంబులు పెట్టి పేల్చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీబీఐతో విచారణ జరిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై సీబీఐతో లేదా ఇతర ఏ ఏజెన్సీతోనైనా విచారణ జరిపించాలని సీఎంను కోరతానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుందే తప్ప ఎన్నడూ కూలగొట్టిన చరిత్ర లేదన్నారు.