- గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బైఠాయింపు
- 2 గంటలైనా హరీశ్, కేటీఆర్ రాకపోవడంతో వెనుదిరిగిన మంత్రులు
- ఇన్ని అప్పులు చేయలేదని కేసీఆర్‌తో చెప్పిస్తే రాజీనామా: మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: గురుకుల టెండర్లలో అవినీతి జరగలేదని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలపై పూర్తి ఆధారాలతో గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్దకు వస్తే.. బీఆర్ఎస్ మాజీ మంత్రులు రాలేదన్నారు. గురువారం ఈ అంశంపై చర్చ చేసేందుకు బీసీ, ఎస్సీ, మైనారిటీ శాఖల మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద బైఠాయించారు.
సుమారు 2 గంటల పాటు అక్కడే ఉండి బీఆర్ఎస్ నేతలు రాకపోవడంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ నేతల ఆరోపణలపై మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల వ్యవహారం చూస్తుంటే ‘ఆడలేక పాత గజ్జెలు’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆలస్యంగా పరీక్షకు వచ్చి అనుమతించకపోతే టీచర్లను దూషించినట్టుగా హరీశ్ రావు వాలకం ఉందన్నారు. మొత్తం టెండర్లు రూ. 1,143 కోట్లు అయితే.. ఒకసారి రూ.2 వేల కోట్లు, మరోసారి రూ.3 వేల కోట్లు అని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
మొత్తం కొనుగోలు ప్రక్రియలో రూ.687.77 కోట్లు గురుకుల టెండర్లు కాగా.. ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 455.23 కోట్లకు టెండర్లు పిలిచాయన్నారు. అందులో ఏ కంపెనీ వస్తే దానికి ఇచ్చారని చెప్పారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు మఫాత్ లాల్ బట్టలు ధరించవద్దా అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. గడిచిన పదేండ్లలో ఎంతో అవినీతి చేసిన కేటీఆర్ కూడా మాట్లాడడం కరెక్ట్‌కాదన్నారు. ‘మేము అవినీతి చేసినట్టు నిరూపిస్తే.. మీరు ఆధారాలు చూపిస్తే.. మేము ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తాం’ అని మంత్రి సవాల్ విసిరారు. 327 గురుకులాలు ఉంటే అందులో మీ పార్టీకి సంబంధించిన ప్రైవేట్ భవనాల్లో పెట్టుకున్నారని, తాము ఎక్కడా బకాయిలు లేకుండా గ్రీన్ చానెల్ ద్వారా చెల్లిస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు.
దిగజారుడు రాజకీయాలకు బీఆర్ఎస్ నిదర్శనం
‘గన్‌పార్క్ వద్దకు రావాలని మేము అనలేదు. ఎమ్మె ల్యేలు అయిన మాజీ మంత్రులతో చర్చకు సిద్ధం అన్నాము. సమయం, స్థలం చెప్పలేదు. అయినా, గన్‌పార్క్‌వద్ద మేము చాలాసేపు వేచి చూశాం. ఎవరూ రాకపోవడంతో ముందే నిర్ణ యించిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లాం. ఆ విషయం తెలుసుకుని నిమ్మలంగా మీరు అక్కడికి వచ్చేందుకు ప్రయ త్నిస్తే మా తప్పు కాదు. మేము అధికారిక కార్యక్రమాల్లో ఉండగా మీ ఫోన్ కాల్‌కు స్పందించలేదని మమ్మల్ని పిరికివాళ్లమని అనడం హాస్యాస్పదం.
అధికారిక కార్యక్రమాల్లో మేం బీజీగా ఉంటే దాన్ని రాజకీయం చేయడం మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం’ అని మంత్రి పొన్నం మండిపడ్డారు. ఫోన్ చేసినట్టు స్క్రీన్‌షాట్‌లు చూపిస్తూ ప్రచారం చేసుకోవడం మీ హోదాకు తగదని ఆయన సూచించారు. ‘హైదరాబాద్ జిల్లాలో ముందుగానే ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని మీడియా ముందు స్పష్టంగా చెప్పిన తర్వాతే మేము
అక్కడికి వెళ్లాము. అయినప్పటికీ వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదు. మిమ్మల్ని అరెస్ట్ చేయించేంత పిరికివాడిని నేను కాదు. అసలు మీరు వస్తున్నారు అని తెలిస్తే నేను తప్పకుండా ఉండేవాడిని” అని మంత్రి పొన్నం తెలిపారు.
చర్చకు సిద్ధమని వెనక్కి తగ్గారు: మంత్రి అడ్లూరి
గురుకుల టెండర్లపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు వెనక్కి తగ్గారని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. గురుకులాల టెండర్ల ప్రక్రియ మొత్తం అత్యంత పారదర్శకంగా, నిబంధనల మేరకే జరిగిందన్నారు. గురుకులాల్లో రూ.686 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని, ప్రతి దశకు పూర్తి వివరాలు, ఆధారాలు మా వద్ద ఉన్నాయన్నారు. “ హరీశ్‌రావుతో పాటు ఆయన భజన బృందం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలతో చర్చకు రావాలని పిలిచాం.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ చర్యలను చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మేము మీలా తోక ముడుచుకుని పారిపోయేవాళ్లం కాదు... ప్రజల ముందు నిలబడి సమాధానం చెప్పేవాళ్లం” అని మంత్రి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేస్తున్న ఆరోపణలకు మా పార్టీ అధికార ప్రతినిధులే తగిన సమాధానం చెబుతారని, మంత్రులు అవసరం లేదన్నారు. గురుకుల టెండర్లతో పాటు అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చకు మేం రెడీగా ఉన్నామని మంత్రి లక్ష్మణ్ స్పష్టం చేశారు.
