
- పీసీసీ చీఫ్ జోక్యంతో సద్దుమణిగిన సమస్య
- అడ్లూరికి క్షమాపణ చెబుతున్నా: పొన్నం
- ఇంతటితో వివాదం ముగిసింది: అడ్లూరి
- ఇదొక కుటుంబ సమస్య: మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య గత నాలుగు రోజులుగా నెలకొన్న వివాదానికి బుధవారంతో తెరపడింది. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ జోక్యంతో సమస్య సద్దుమణిగింది. ఆయన బుధవారం ఉదయం ఇద్దరు మంత్రులను తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. అసలు అక్కడ ఏం జరిగింది? బయట ఏం ప్రచారం జరుగుతున్నది? అనే వివరాలను తెలుసుకున్నారు. బయట జరుగుతున్న ప్రచారం పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉన్నదని మంత్రులకు వివరించారు. చివరకు పొన్నంతో అడ్లూరికి క్షమాపణలు చెప్పించడంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టినట్టయింది. అనంతరం మంత్రులతో కలిసి మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
నేను అనని మాటలు అన్నట్టు రాశారు: పొన్నం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విషయంలో తనకు ఎలాంటి దురుద్దేశం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ‘‘నేను అనని మాటలు అన్నట్టుగా పత్రికల్లో రావడంతో అడ్లూరి బాధపడ్డారు. ఆయనకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను” అని తెలిపారు. ‘‘నేను కరీంనగర్‌లో మాదిగ సామాజిక వర్గంతో కలిసి పెరిగాను. అందుకే ఆ సామాజిక వర్గంలో నాపై ఎలాంటి అపోహ ఉండొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు అడ్లూరి విషయంలో వేరే ఆలోచన ఏమాత్రం లేదు. ఆ ఒరవడితో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదు” అని పేర్కొన్నారు. ‘‘మేమంతా సామాజిక న్యాయం కోసం కలిసి పనిచేస్తాం. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ చాంపియన్. సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలను పక్కనపెట్టి.. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నాయకత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం పోరాటం చేస్తున్నాం” అని అన్నారు.
సమస్య సద్దుమణిగింది: అడ్లూరి
తన సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో మాదిగ వర్గం బాధపడిందని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. తనకు పొన్నం క్షమాపణలు చెప్పడంతో ఈ సమస్య సమసిపోయిందని చెప్పారు. ‘‘సామాన్య కార్యకర్తగా జెండా మోసిన నాకు.. కాంగ్రెస్ పార్టీ మంత్రిగా అవకాశం ఇచ్చింది. నేను పార్టీ లైన్ దాటే వ్యక్తిని కాదు. పొన్నం ప్రభాకర్‌ను గౌరవిస్తాను. అట్టడుగు వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది” అని పేర్కొన్నారు.
మంత్రులు బాధ్యతాయుతంగా మాట్లాడాలి: మహేశ్ గౌడ్
మంత్రులు ఇక నుంచి ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. కాంగ్రెస్ అన్ని వర్గాల పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘మంత్రి పొన్నం వ్యాఖ్యలతో మరో మంత్రి లక్ష్మణ్ నొచ్చుకోవడం, యావత్ సమాజం కొంత బాధపడిన విషయం నా దృష్టికి వచ్చింది. ఇది ఇద్దరు మంత్రుల మధ్య జరిగిన వివాదం. ఇది కేవలం ఒక కుటుంబ సమస్య మాత్రమే. దీనిపై పొన్నం బాధపడుతూ క్షమాపణలు చెప్పడంతో ఇంతటితో సమస్య సద్దుమణిగినట్టే. మాదిగ వర్గం కూడా ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టాలి” అని విజ్ఞప్తి చేశారు.