కరీంనగర్​ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?

కరీంనగర్​ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
  • ప్రజాస్వామ్యాన్ని చంపి ఉప ఎన్నికలకా!
  • బండిది టీఆర్ఎస్ ప్రాయోజిత పాదయాత్ర
  • కరీంనగర్​ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
  • పాదయాత్ర ముగింపు సభలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​

ఎల్కతుర్తి, వెలుగు: ఒకప్పుడు ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికలు వచ్చేవని, ఇప్పడు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని చంపి ఉప ఎన్నికలకు వెళ్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ కొట్లాడుకున్నట్లు నటిస్తూ దోస్తాన చేస్తున్నాయని, బండి సంజయ్​ది టీఆర్ఎస్​ ప్రాయోజిత పాదయాత్రని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు గంభీరావుపేటలో ‘ఆజాదికా గౌరవ్’​ పేరిట చేపట్టిన పాదయాత్ర 135 కిలోమీటర్లు కొనసాగి ఎల్కతుర్తిలో గురువారం ముగిసింది. ముగింపు సభలో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఏఐసీసీ సెక్రటరీ రుద్రరాజ్, మైనార్టీ సెల్ ​రాష్ట్ర అధ్యక్షుడు సోహెల్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్​రెడ్డి, ​ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్​రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. టీఆర్ఎస్​ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీతో కేసీఆర్ ​పాదయాత్రలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు.

2014లో తాము ఎన్​హెచ్​ 563 తెచ్చామని, దానిని ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారన్నారు. పాదయాత్ర ద్వారా ముంపు గ్రామాల సమస్య, వేములవాడ అభివృద్ధి, కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ, పలు రైతు సమస్యలు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. తమది రైతు ప్రభుత్వమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. కరీంనగర్​అభివృద్ధిపై గొప్పలు చెప్పుకొనే వినోద్​కుమార్, బండి సంజయ్, కేసీఆర్​వారి హయాంలో జరిగిన అభివృద్ధిపై​ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్​ విసిరారు.  ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం చేసేవారికి మాత్రమే రైతుబంధు ఇవ్వాలని, బడాబాబులకు ఇస్తే ఫలితం ఉండదని, దీనిని కేసీఆర్​ గుర్తించాలని సూచించారు.