రాష్ట్రంలో బీసీ బంధు స్కీమ్ నిలిపివేత: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

రాష్ట్రంలో బీసీ బంధు  స్కీమ్ నిలిపివేత:  మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

రాష్ట్రంలో బీసీ బంధు స్కీమ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆదివారం గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. బీసీ బంధు స్కీమ్ లో గత ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని.. పథకం అమలుపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.  

పేద బీసీ వర్గాలకు చెందిన పేద ప్రజలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీ బంధు స్కీమ్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పథకంలో అవకతవకలు జరిగే అవకాశం ఉందని.. తమ ప్రభుత్వం పథకం అమలుపై సమీక్షించి.. పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు.

 రైతుబంధు డబ్బులు ఇంకా రైతుల ఖాతాల్లో వేయకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని మంత్రి తప్పుబట్టారు. మేము అధికారంలోకి వచ్చి రెండు రోజులే అవుతుందని అప్పుడే..  మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని.. రానున్న 100 రోజుల్లో మిగతా నాలుగు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.